ఇంద్రియాలను నియమించుకోలేక పోవడం ఆపదలుకి దారి. వాటిని జయించడం సద్గతికి మార్గం. నువ్వు ఎలా వెళ్తాలో నువ్వు ఎన్నుకో!
ఇంద్రియాలకు దాసులై నశించిన రాక్షసుల కథలు మనకు చాలా తెలుసు. అయితే, దేవ జాతి లో పుట్టిన త్రిశిరో ముని విచిత్ర కథ ఈ అంశాన్ని మనకి ఇంకా బాగా వివరిస్తుంది.
త్వష్ట ప్రజాపతికి 3 తలల గల కొడుకు ఉండేవాడు. అతనిని త్రిశిరసుడు అని పిలిచేవారు. యితడు బాల్యం నుంచి గొప్ప తపశ్శాలీ. వేదాలను పారాయణ చేసేవాడు. కానీ, అది ఏమి విచిత్రమో- ఒక తలతో వేద పారాయణ చేసేవాడు, రెండో తలతో దిక్కులు చూస్తూ ఉండేవాడు, మూడో తలతో నిత్యమూ మద్యపానం చేసేవాడు.
క్రమంగా ఇతని తపశ్శక్తి యెంత పెరిగిందంటే - ఇతని తపస్సును భంగం చేద్దామని వచ్చిన ఊర్వశి రంభాదులకు ఘోర పరాజయం తప్పలేదు. ఇది తక్కువ స్థితి కాదు.
ఇంత స్థితి వచ్చినా, దిక్కులు చూసే రూపంలో, మద్యపానం చేసే రూపంలో ఇతనికి లోపాలు ఉన్నాయి కదా? ఇంతటి దుర్బల హ్రదయుడికి అంతటి తపశ్శక్తి ఉండడం ప్రమాదమే అని గ్రహించాడు దేవేంద్రుడు. ఒక్క సారి ఇతని మూడు తలలు నరికేశాడు.
చూసేరా, శ్రేయో మార్గం లో తపస్సు, వినాశ మార్గం లో ఇంద్రియ లోలత్వం- రెండు త్రిశిరసుడి దెగ్గిర ఉండేవి. ఇతని రెండు తలలు ఇతను చేసిన తపస్సును భంగం చేసి వేసేయి. కనుక, ఆధ్యాత్మిక మార్గం లో కాలు పెట్టిన వారు- ఇంద్రియాల విషయం లో జాగర్త వహించాలి.
దత్త దర్శనం లో సుమతి మొగుడు కౌశికుడి కథ కూడా ఇదే చెపుతుంది. సామాన్య మానవుడికి ఈ విషయం లో అండ సద్గురు శరణాగతియే. ఈ శరణాగతి తోనే మహారుషులు కూడా ఇంద్రియాలను జయించ గలిగేరు.
(స్పీచ్ 7 జూన్ 1990; భక్తిమాల జనవరి 1991)