SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 08 Jul 2019
పూర్ణత్వం అంటే ఏమిటి?

పూర్ణిమానికి మరోఅర్థం ఆనందం. పూర్ణత్వం ఉంటె ఆనందం ఉన్నట్లే. ఆనందం ఉంటె- పూర్ణమైనట్లే. పూర్ణం అంటే ఆనందం కనుక, జ్ఞానం పొందిన వాడిని పూర్ణచంద్రుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే దత్తాత్రేయుడిని పూర్ణచంద్ర ప్రకటిత - అని కీర్తించేరు స్వామిజి.

దత్తుడు అంటే జ్ఞానం యొక్క అవతారం. దత్త స్మరణ చేసేవాడు ఏదో ఒక నాటికి జ్ఞానం దెగ్గిరకి పోక తప్పదు! పూర్ణానికే మరో పర్యాయపదం-అఖండం. అఖండం అంటే ఖండాలు లేనిది. అది అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది.

అఖండ మండలా కారం అంటే- అన్ని చోట్లా వ్యాపించి ఉండేవాడే సద్గురువు. అఖండమైనది అన్ని ఖండాలలోనూ వ్యాపించి ఉంటుంది కనుక అది అత్యంత స్థూలము కూడా అవుతుంది. అంటే- చీకటి వెలుగు కూడా అదే అని చెప్పవచ్చు.

అఖండ మండలాకారం, వ్యాప్తం యేన చరాచరం - అని గురుగీతలో గురువును కీర్తించేరు. చార, స్థిర, అణువులన్నింటా వ్యాపించి ఉన్నవాడే అఖండుడు. ఇట్టివాడు, అన్ని భాగాలలోను సమంగా వ్యాపించి ఉంటాడు. అది ఎలా సాధ్యము?

పటిక బెల్లం ముక్కలలో చిన్న ముక్కలో చిన్న తీపి, పెద్ద ముక్కలో పెద్ద తీపి ఉంటుందా? తీయ్యదనం అన్ని ముక్కలలో సమంగా వ్యాపించి ఉంది. అలాగే గురువు అన్నిటిలోను సమంగా వ్యాపించి ఉన్నాడు.

మరి, గురువు అందరిలో, అన్నింటిలో సమంగా వ్యాపించి ఉంటె ఇక అజ్ఞానం ఎక్కడిది? అల్లా చూస్తే అసలు అజ్ఞాని లేదని వస్తుంది. మరి అయితే, ప్రపంచం అంతా ఎందుకు అజ్ఞానం గా ఉంది? ఇది ఆలోచిద్దాం.

ఇక్కడ కాకడ హారతికి 16 దీపాలు వెలిగించేరు. అన్నిటిలోను వత్తులు, నూనె ఉన్నాయి. అగ్నితోనే వెలిగించాం. అన్ని ప్రకాశిస్తున్నాయి కానీ, అన్నిటి ప్రకాశం ఒకేలాగా లేదే? హెచ్చు తగ్గువులు ఉన్నాయి. ఎందువల్ల?

అలాగే, సద్గురువు అన్ని ఖండాలలో వ్యాపించి ఉన్నాడు. సద్గురు యొక్క శక్తి అందరు జీవులకు ప్రసరించగలడు. ఆలెక్కన, నువ్వు కూడా సద్గురువే. కానీ, నీకు, నాకు అనుభవం లో భేదం ఉంది.

మరి అయితే, మనం పూర్ణత్వం ఎలా పొందాలి? అనేది మనకు ముఖ్యమైన ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం. గురువును అనుసరించు. గురువును తూచాలని,కొలత చెందాలని ప్రయత్నించకు. ఒక నాటికి తప్పక ఆయనలో కలిసిపోతావు. ఎందుకంటె ఆయన పూర్ణుడు.

గురువును శారీరకంగా,మానసికంగా అనుసరించాలి. ఆయన నరకానిపోతే నేను కూడా అక్కడికే వెళ్తాను. అనే దృఢ భావం రావాలి. ఆయనే శివుడు, ఆయనే యముడు, అని అనుకోవాలి.

(గురు పూర్ణిమ, భక్తిమాల ఆగష్టు 1991)

Tags: