ఈ లోకం లో వచ్చిన ప్రతి మానవుడికి మూడు ఋణాలు ఉంటాయి. అతడు మళ్ళి ఈ లోకాన్ని విడిచే లోపల వాటిని తీర్చుకోవాలి.
మొదటిది తన తండ్రి, తాతలు మొదలైన వంశ వృద్ధులకు ఉన్న ఋణం. దీనిని పితృ ఋణం అంటారు. రెండవది దేవతల ఋణం. దీనిని దేవ ఋణం అంటారు. మూడవది, తన గురుదేవులకు వారి గురువులకు ఋణం. ఋషి ఋణం అంటారు.
సకాలం లో తర్పణాలు, శ్రాద్దాలు, జరపటం వల్ల పితృ ఋణం నుంచి విముక్తి అవుతుంది. శ్రద్ధ భక్తులతో కూడిన పూజలు, దివ్య నామ సంకీర్తనలు వగైరాల వాళ్ళ దేవ ఋణం పూర్తి అవుతుంది. కానీ గురు ఋణం లేదా ఋషి ఋణం తీర్చుకోవడం అంత సులభం కాదు.
నిజానికి ఆ ఋణం పూర్తిగా తీర్చుకోవడం అసంభవం. నిరంతరంగా సద్గ్రంథాలను పఠిస్తూ పఠించిన విషయాలను మననం చేస్తూ, తానూ నేర్చుకున్న విద్యలను అర్హులకు బోధిస్తూ ఉంటె- ఈ క్రియల ద్వారా ఈ గురు రుణాన్ని తగ్గించుకోవచ్చు. అంతే!
నేర్వటం,నేర్పటం అనేవి రెండు రెక్కల లాంటివి. ఒక రెక్క లేకపోతె పక్షి బ్రతక వచ్చేమో గాని ఆ బ్రతుకు నిస్సారమైనది. రెండు రెక్కలు లేకపోతె - అది బ్రతుకే కాదు. అందుకే, పెద్దలు - నేర్చుకో- నేర్పు అంటారు!
భక్తిమాల ఏప్రిల్ 1991