విచక్షణ జ్ఞానం గలవారు చచ్చిపోయిన భూతకాలం గురించి పట్టించుకోరు. ఇంకా పుట్టని భవిష్యత్కాలము గురించి ఆలోచించరు. వారు వర్తమానకాలం లోనే జీవిస్తారు. అలా ఉండగలవారే ఆధ్యాత్మిక రంగంలో పై మెట్లెక్కగలరు. ఉదాహరణగా మహర్షి నారద పూర్వ జన్మ వృతాంతం గమనించండి.
పూర్వ జన్మలో నారదుడు ఒక మఠం లో దాసీ పుత్రుడు. ఆ తల్లికి ఒక్కడే కొడుకు. తండ్రి లేడు. మఠంలో సన్యాసులు చర్చలు వినీవినీ 5 ఏళ్ళ వయస్సులోనే ఆ బాలుడికి తత్త్వదృష్టి ఏర్పడింది. క్రమంగా పరమాత్మ దర్శనం రేఖా మాత్రంగా కాసాగింది
కానీ, అంతకన్నా విశేషంగా నిరంతర భగవద్ అనుభూతి కలగాలని ఆ బాలుడు తపన పడసాగేడు. అతని గురువులు మాత్రం- నీకిది ఈ జన్మలో లభించదు. కనుక పై జన్మకోసం వేచిఉండు.'- అన్నారు.
గురువు ఆజ్ఞ అయింది కనుక ఇక వేరే చింత లేదు. అతనికి ఇహ లోకంలో ఉన్నవి రెండే రెండు బంధాలు. ఒకటి తల్లి, రెండవది తన శరీరం
ఇలా ఉండగా ఒక రోజు పాము కరిచి తల్లి మరణించింది. బాలుడు దుఃఖపడలేదు. సంతోషించలేదు.
తన ఆధ్యాత్మిక సాధనలు మరింత పెంచెడు. ఆ పెంచడం సహజ ప్రవ్రుత్తి వల్లేగాని త్వరగా చచ్చిపోయి రెండవ జన్మ ఎత్తాలని కాదు.
తను బ్రతికి ఉన్నాడు. సాధనకు అడ్డం పెట్టె తల్లి కూడా లేదు కనుక సాధన పెంచెడు. అంతే
ఇదే వర్తమాన కాలంలో జీవించడం అంటే. ఇలా వర్తమానం లో ప్రవర్తిస్తున్న ఆ బాలుడి శరీరం క్రమంగా రాలిపోయింది.
ఈ మాటు అతడు బ్రహ్మకి మానస పుత్రుడై జన్మించేడు. అతడే దేవర్షి నారదుడు.
దత్త దర్శనం లో విష్ణు దత్తుడు కూడా వర్తమానంలో జీవించేవాడు. దత్త కృప వల్ల అలా జీవించే తత్త్వం మీకు వంట బట్టుగాక!
(స్పీచ్ 8-6-1990; భక్తిమాల మే 1991