SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
సామూహిక అర్చన

పెద్ద పెద్ద క్షేత్రాలకి ఎంతో ఆశగా వెళ్తాము. ఆ వెళ్ళేది ఉత్సవాల సమయాలలో వెళ్తాము. తీరా వెళ్తే అక్కడ ఒకటే గందరగోళం. భజనలు, మంగళవాయిద్యాలు, వేదం ఘోషాలు, అన్ని గోల గోల గా ఉంటుంది. అక్కడ ఏకాగ్రతకు సావకాశము కనిపించదు. పైగా దేవుడ్ని విశ్రాంతిగా చూసే అవకాశము దొరకదు. ఇక ఏమి ప్రయోజనము లభిస్తుంది మనకి అక్కడ వెళ్తే, అని అనిపిస్తుంది. అదిగాక, ఏకాంతంలో హాయి గా ధ్యానం చేసుకోవాలి గాని ఈ గుంపుల్లో భగవద్ సేవవల్ల ఏమి లాభం దొరుకుతుంది? అని మనకి అనిపిస్తుంది.

అలా ఆలోచించేవారికి దేవుడి పూజలో తత్త్వం అర్థం కాలెండన్నమాట. దైవధ్యానం వేరు. దైవపూజ వేరు. దైవధ్యానం లో ఆ దేవత గుణాలను మననం చెయ్యటం ప్రధానం. దైవపూజలో అర్పణ ప్రధానం.

‘అర్పణ’ అంటే ఏమిటి? మనకు ఏమి ఉందొ, మనము దేనిని కోరుకుంటున్నామో ఆ రెండు కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉన్నాయని గుర్తించి అవి ఆయనవే అని నిరంతరం గుర్తుపెట్టుకోవటమే అసలైన అర్పణ. అంతేగాని, ఆయనకు లేనిది ఆయనది కానిది ఏదో ఉంది దాన్ని నువ్వు ఆయనకు అందజేస్తున్నావని భావన వస్తే - అది అర్పణ కాదు.

నిజానికి దేవుడికి లేనిది కానీ, కావలసింది కానీ, నీవు ఇవ్వగల వాస్తు గాని లేనే లేదు. అలాంటప్పుడు నువ్వు ఇవ్వటమనే సమస్య ఎలా ఉంటుంది? కనుక, అర్పణ అంటే ఉన్న వస్తువులన్నీ ఆయనవే అని గ్రహించటం!

చిత్రమేమంటే వస్తువులు ఆయనవే తప్ప నీవికాదని యెంత ఎక్కువగా నీకు గుర్తింపు కలిగితే అంత ఎక్కువుగా వస్తువులు నీ దెగ్గిరికి చేరుతాయి! ఈ కిటుక వల్లనే భగవంతుడికి అధికంగా సమర్పణలు చేసిన వారికి సంపదలు అధికంగా పెరుగుతూ ఉంటాయి.

దీన్నే వెనుక్కు తిప్పి చెప్తే నీకు ఏదియేది కావాలనుకుంటున్నావో, దానిని నువ్వు భగవంతుడికి సమర్పించడం నేర్చుకో.

రెండవది, మానవుడు ప్రధానంగా సంఘజీవి. కనుక వాడి కోరికలలో ప్రధానమైనవన్ని ఇతరులతో ముడిపడి ఉన్నాయి. కనుక, ఆ కోరికలు తీరాలంటే అతడు చెయ్యవలసిన అర్చన, పూజ, అర్పణ, అన్ని కూడా ఇతరులతో కలిసి సంఘంగా చేసితీరవలసినదే .

అందుకే, దేవాలయాలలో క్షేత్రాలలో సామూహిక అర్చనలు ఏర్పాటు చేసేరు పెద్దలు. పూర్వం మహారాజులు కూడా ఉత్సవాలలో జన సామాన్యంతో కలిసి పంచుకునేవారు.

ఉత్సవాలు, తీర్థయాత్రాలు లో మరో విషయం ఉంది. అక్కడ నీకు దైవదర్శనమే కాక, ఇతర భక్తుల దర్శనం కూడా లభిస్తుంది. సత్సంగ, లభిస్తుంది. సహన శక్తి అభ్యాసమవుతుంది.

ఇక్కడ జరిగే దేవి నవరాత్రులలో కూడా మీరందరు అనేక విధాలా సేవలు చేస్తున్నారు. మీలో ఏఒక్కరికైనా, యెంత ధనవంతులైన, భగవతికి ఎన్ని సేవలు అర్పించగలరు? అన్ని సేవలు చెయ్యలేరు. ఒకవేళ చెయ్యగలిగేరు అని అనుకుందాం. ఆ ఫలితం ఒక్కరికేగా దక్కేది? అందరూ కలిసి చేస్తే ఆ ఫలం అందరికి దక్కుతుంది. శక్తివంచన లేకుండా తనవంతు సేవలు అందించిన ప్రతివ్యక్తికి స్వామిజి ఆచరించే ఈ మహావ్రతా ఫలం సంపూర్ణంగా దొరుకుతుంది.

ఇదే, క్షేత్రాలలో, దేవాలయాలలో జరిగే ఉత్సవాలలోని విశేషం.

(నవరాత్రి 1991- భక్తిమాల జనవరి 1992)

Tags: