ఒక ఊరిలో ఒక సాధు ఉండేవాడు. ప్రతిదినము అతడు వీధులలో ‘ఓం నమః షివాయ’ అని అరుస్తూ తిరిగేవాడు. ఆ ఊరి పిల్లలు ఆయనను పిచ్చివాడిగా భావించి రాళ్లు విసిరేవాళ్ళు. కానీ ఆ సాధువుకి శివుడి మీద అమిత భక్తి ఉంది. శివుడిని ధ్యానించేవాడు కనుక శివుడు ఆ రాళ్లను పువ్వులుగా మార్చివేసేవాడు. ఇలా చాలా రోజులు గడిచేయి. ఒక రోజున ఆ సాధువు ఆ పిల్లలు తన మీద రాళ్లను విసరడం చూసి కోపించేడు. వాళ్లకి పాఠము నేర్పించాలని అనుకోని, తాను కూడా రాయి తీసేడు. పరమశివుడు ఇది పైనుంచి చూసేడు. వెంటనే ఇలా అనుకున్నాడు,
‘ఈ భక్తుడు తనను తానే రక్షించుకుందామని అనుకున్నాడు. సరే. అయితే వాడి ఖర్మకు వదిలేస్తాను.’ వెంటనే పిల్లలు విసిరిన రాళ్లు పువ్వులుగా మారకుండా వచ్చి వాడిమీద పడ్డాయి. ఒళ్ళంతా దెబ్బలయిపోయింది.
మనము భవిష్యత్తుకు బెంగ పడకూడదు. గతాన్ని గురించి చింతించకూడదు. అన్ని భగవంతుడిపై విడవాలి. ఆంతా భగవంతుని ఇచ్ఛ మరియి లీల అని గుర్తుంచుకోవాలి.
(తెలుగు భక్తిమాల నవంబర్ 1980)