SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
పూజ ఎందుకు చెయ్యాలి?

‘పూజ ఎందుకు’- అని నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. వారితో మనం వాదన చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మనము ఈ ప్రశ్న మనకే వేసుకుందాము.

మరి, భగవంతుడు సర్వవ్యాపి కదా, ఆయనకు ఆవాహనం ఎందుకు? ఆయన సర్వకాలాలలో ఒకే రీతిగా ఉంటాడు కదా, ఆయనకు విసర్జన ఎలా కుదురుతుంది? ఇలా పూజలో ప్రతి అంశం గురించి వివరంగా ప్రశ్నించుకోండి– మీలో మీరే.

సూటిగా,దాపరితనం లేకుండా చెప్పుకోవాలంటే -పూజను కేవలం కొద్దీ సేపే చేసే పనిగా కుదించుకోవటానికే ఆవాహన, విసర్జనాలు పెట్టేరు!

నిజానికి పీల్చే ఊపిరే జపం; చేసేపని అంతా అర్చన; అన్న భావనతో మన అర్చన నిరంతరంగానూ అఖండంగానూ సాగాలి. అలా సాగించే శక్తి మనకు లేదు. కనుక కొంచం సేపు చెయ్యంగానే పూజ ఆపేసే సౌకర్యం మనకి కావాలి కనుక, అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడిని ఒక విగ్రహం లోకి ఆవాహన చేస్తూ ఉంటాము మనం! పూజ కొంచంసేపు చేసేక, ఆపేసేందుకు వీలుగా విసర్జనం చేస్తాము. ఇది ఒక దృష్టి.

మన ఏకాగ్రత శక్తి అల్పం కనుక ఏకాగ్రత నిలిచేందుకై ఒక ఆధారమైనది రూపం, ఆ రూపాన్ని ఆశ్రయించుకొని కొంతపని ఉండాలి కనుక పూజ కార్యక్రమం ఏర్పరిచేరు పెద్దలు. ఒకే బిందువు మీద, లేక ఒకే భావన మీద మనస్సు కదలకుండా నిలపడం కష్టం. ఆ బిందువు చుట్టూ వృత్తం గీసుకొని, దానిలో తిరుగుతూ, ఉండటానికి మనస్సుకు ఏర్పాటు చేస్తే, - మనస్సుకు అది కొంత తేలికగా ఉంటుంది. క్రమంగా ఆ బిందువు మీద మనస్సు నిలపడానికి దారి కూడా ఏర్పడుతుంది. పూజ విగ్రహం అనే బిందు చుట్టూ ఏర్పడిన పెద్ద వృత్తమే. ఇది రెండవ దృష్టి.

ఇంకో దృష్టి కూడా ఉంది. మనకు అనేక రకాల భోగాలు మీద ఆశ ఉంది. మనం అనుభవిస్తున్నాము కూడా. అయితే**, భగవంతుడు మనకు తల్లి, తండ్రి, బంధువు. మన కుటుంభం లో ఒక సభ్యుడు.** నువ్వు బాగా సంపాదిస్తూ ఉంటె, నీతో పాటు నీ కుటుంబ సభ్యులు కూడా సుఖంగా ఉండాలని నువ్వు కోరుతావా లేదా? నీ కుటుంభం లో భగవంతుడు సభ్యుడు కాబట్టి, నీ భోగాలలో ఆయనకీ భాగం ఇవ్వటమే పూజ అనే పధ్ధతి.

ఇలా ఉండగా, నీ తండ్రి సంపాదించి నీకు ఆస్తి ఇచ్చేరు. దానికి నిజమైన సొంతదారు నీ తండ్రినే కదా? ఆయన సౌకర్యం చూడకుండా నువ్వు సుఖాలు అనుభవించగలవా? అలాగే, నీ ఆస్తులకు నిజమైన సొంతదారు ఆ భగవంతుడు! అందుకే నీ సుఖాలు ముందు ఆయనకే సమర్పించాలి. ఇది దాటరాని ధర్మం. దీనికి ఉపాయమే అర్చన. ఇది నాల్గవ దృష్టి

ఈ నాలుగు దృష్టాంతాలతో మనం పూజలు చేస్తాము. కానీ, వీటిలో ఎక్కడ మన సంకల్పం గురించి చెప్పలేదే? అని అనుకోవచ్చు. మరి మన కోరికలు ఎలా తీరుతాయి?

భగవంతుడు మన ఇంటి సభ్యుడు. ఆయన మన తల్లి, తండ్రి అయినన్నపుడు మన కోరికలు తీరుస్తాడు అని వేరుగా చెప్పాలా? అయితే, మనం ఎందుకు సంకల్పం లో కోరిక చెప్తాము? చెప్పకుండానే ఆయనకు తెలుసుకదా?

నిజమేగాని, ప్రార్థిస్తే గాని వరమివ్వను అనే గుణం ఆయనలో ఉంది. దేవతలు అందరూ ప్రార్థిస్తేనే ఆయన కృష్ణావతారం తీసుకున్నాడు. దేవతలు చిదగ్ని కుండం లో యాగం చేసినప్పుడే అమ్మవారు ఆవిర్భవించింది. ఇది ఏమిటి, ఎందుకు?

అసలు ప్రార్థన నీ లోని అహంకార సంహారం కోసమే! దేవుడికి విషయం చెప్పడానికి కాదు. నీ హృదయం లో అహంకారం అలా ఉండిపోతే, రాక్షసుల సంహారం జరిగి పోయినా వాళ్ళు నీ హృదయంలో మళ్ళీ పుడతారు. అందుకే నువ్వు ప్రార్థించేవారకు అనుగ్రహించడు దేవుడు.

మన బుద్ధిలో రజస్, తమస్సు అధికంగా ఉంటుంది. వీటివల్ల అత్యాశ, సోమారితనము కలుగుతుంది. శరీరం సుఖాలు కోరుకుంటుంది. ఈ స్థితి ఉన్నవారికి మనస్సు ప్రార్థనపై వెళ్ళదు. ఇక ప్రధానంగా సత్త్వగుణం కలవారు - వీరు ఒక ఆభాస వైరాగ్యం లో పడి ప్రార్థన మానేస్తారు. వీళ్ళు ఎన్నో మంచి దానాలు,, అనుష్ఠానాలు, చేస్తారు కానీ రక్షించమని ప్రార్థించరు. కానీ, వాళ్ళు కూడా ప్రార్థించి తీరాల్సిందే. ప్రార్థన లేకుండా రక్షణ దొరకదు! ప్రార్థించను అనేవాడిలో రాక్షస గుణం ప్రవేశించిందన్నమాట.

సత్త్వగుణం తప్పకుండా కావలసినది. అయితే, సాత్వికతను అభ్యసిస్తూ అర్చన క్రమాలను కూడా అనుసరిస్తున్నవాడేఉత్తముడు.

(భక్తిమాల జూన్ 1991)

Tags: