అమ్మవారి పేరులలో ‘కామెశ్వరి అని ఒక పేరు ఉంది. అంటే కోరికలకు అధిపతి అనగా కోరికలు తీర్చే తల్లి. కోరికలు ఉండటమే తప్పు అన్ని పెద్దలంటూఉంటే అమ్మవారి నామాలలో కామేశ్వరి అని ఎందుకు ఉంది? ఆలోచించండి?
కామేశ్వరి అంటే కోరికలు తీర్చేది అన్నాము కదా? అయితే, కోరిక అంటే ఏమిటి? నీకు సంబంధించినంత వరకు ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించిన సుఖం కోసం ఆశపడటమే కోరిక. అని నువ్వు అనుకుంటావు . నిజమే. నీకు తెలిసిన సుఖం అంతా ఏదో ఒక ఇంద్రియాన్ని ఆధారపడి కలిగినదే. నీకన్నా దేవతలు అనుభవించే ఆనందం ప్రబలం గా ఉంటుంది.
ఏమైనా, ఒక సుఖం అనుభవిస్తుండగా మరో సుఖం అనుభవించడానికి సాధ్యం కాదు. ఉదాహరణకు- ఏకాంతం లో విశ్రాంతి సుఖం, సభలో సన్మాన సుఖం ఒకేసారి అనుభవించగలమా? ఇక ఇంద్రియవల్ల వచ్చే సుఖం మిగిలిన ఇంద్రియాలలో దేనినోదానికి దెబ్బ తీస్తుంది. నాలుకకు సుఖం గా తింటే పొట్టకు నొప్పి తప్పదు కదా! ఇవన్నీ నీవు అనుభవించే సుఖాల లక్షణాలు.
ఆనందం అని వేరే ఒకటి ఉంది. దాని అనుభవం ఇంద్రియాల మీద ఆధారపడి ఉండదు. నిజానికి ఆనందమే అసలైన సుఖం. నువ్వు అనుభవించే సుఖాలన్నీ నీటి తుంపరులు అనుకుంటే, ఆనందం అనేది మహా సముద్రం. కనుకనే సుఖాలన్నీ ఆనందం లో అంశాలు అని వర్ణించేరు .
లలితా సహస్రనామావళి లో కూడా, ‘స్వాత్మానంద లేవీ భూత బ్రహ్మాద్యానంద సంతతిః’ అని చెప్పేరు. అమ్మవారి ఆత్మానందం తో పోలిస్తే బ్రహ్మాది దేవతలు అనుభవహించే ఆనందాలు కూడా చిన్న రేణువులు అని అర్థం. ఇక నీ సుఖాలేమి లెక్క? ఆ భగవతి కృపను మనం సంపాదించగలిగితే ఆ తల్లి తన ఆనందాన్నే మనకు అందిస్తుంది.
అంటే ఆనందం అనే మహా సముద్రం నీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు తుంపరువంటి అల్ప సుఖాలు అనుభవించ వలసిన అవసరం ఉండదు కదా! అంటే ఆ తల్లి కృప వల్ల నీ కోరికలన్నీ ఒకే సారి తీరిపోతాయన్నమాటే కదా? అదే బ్రహ్మానంద స్థితి. దాన్ని అందించగల శక్తి జగదాంబ ఒక్కర్తికే ఉంది. అందుకనే ఆమెను ‘కామేశ్వరి’ అన్నారు.
కామేశ్వరి అంటే కోరికలన్నీ తీర్చగల బ్రహ్మానందం అని అర్థం.
(నవరాత్రి 1991- భక్తిమాల జనవరి 1992)