SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 02 Jul 2019
మీనాక్షి, మృగాక్షి, భ్రమరాక్షి, పద్మాక్షి- ఈ పేరులలో పరమార్థం ఏమిటి?

దక్షిణ దేశ శక్తిపీఠాలలో మీనాక్షి ప్రసిద్ధమైన జగన్మాత. పాండ్యరాజు కి పుత్రికగా జన్మించి, విష్ణు మూర్తి కి సోదరి అయి, సుందరేశ్వరుడికి అర్ధాంగి అయింది.

మీనాక్షి అంటే చేపలవంటి కన్నులు గలది అని అర్థం. లలితా సహస్రనామాలలో - వక్త్రలక్ష్మి పరీవాహ చలాన్ మీనాభా లోచన- అని ఒక నామం ఉంది.

ఆక్వేరియం లో మనం రంగు-రంగుల చేపలను చూస్తాము. అవి అటూ ఇటూ తిరుగుతుంటే చూడడానికి ఏంతో అందంగా ఉంటుంది. చేపల కదిలికలో ఆ అందం సహజసిద్ధం. స్వచ్ఛమైన నీరు గల చెరువులో కూడా చేపల పరుగుల అందాలు మనం చూడవచ్చు.

అమ్మవారి ముఖ సౌందర్యం ఒక నీటి ప్రవాహం అనుకుంటే, ఆ తల్లి కళ్ళు అందులో చేపల లాగ ఉన్నాయి అని పై నామం చెపుతుంది.

అమ్మ కళ్ళు అందంగా ఉన్నాయి, అనేది తాత్పర్యం. అంతేనా? కళ్ళను గురించి వర్ణించడానికి సాంప్రదాయంగా కొన్ని ఉపమానాలు ప్రసిద్ధంగా ఉన్నాయి.

భ్రమరాక్షి- తుమ్మెద వంటి కన్నులు; పద్మాక్షి- పద్మం వంటి కన్నులు; మృగాక్షి- లేడి వంటి కన్నులు; విశాలాక్షి- పెద్ద కన్నులు. ఈ కన్నులు అన్ని లలితా సహస్రనామంలో వర్ణించబడినవే.

బయటికి ఈ ఉపమానాలన్నీ అందాన్ని సూచిస్తాయి. అయితే, అంతర్గతం గా వాటికి వేరే వేరే పరమాతాలు ఉన్నాయి.

కళ్ళు తుమ్మెదలాగా ఉన్నాయి అంటే నల్లగా ఉన్నాయి అని సామాన్యార్థం. అయితే ప్రతి పువ్వులోని తేనే బిందును ఆస్వాదించడం తుమ్మెద కి ఉన్న ప్రత్యేక విద్య. కనిపించే ప్రతి పువ్వులోని దివ్యత్వాన్ని, ఆ పరమాత్మ చైతన్యాన్ని గుర్తించ గలగడం కొన్ని కన్నులకే తెలుసు. నిజానికి పరమాత్మ మనకు కళ్ళు ఇచ్చింది దీనిని గుర్తించడానికి! అదే కళ్ళకు అందం. తుమ్మెద కళ్ళు అనే ఉపమానం లో ఇదే పరమార్థం.

పద్మాక్షి అంటే పద్మం లాగ, అందంగా, నిర్మలం గా ఉంటుంది అని తెలుస్తుంది. పద్మం అంటే సహస్రార పద్మం గుర్తుకు రావాలి. పద్మం యోగానికి సంకేతం అవుతుంది. యోగి నేత్రాలలో ఒక ప్రత్యేకత ఉంటుంది అని యోగులతో పరిచేయం ఉన్నవారికి తెలుస్తుంది. పద్మాక్షి అంటే యోగ నిమగ్నమైన నేత్రాలు అని పరమార్థం

మృగాక్షి అంటే లేడి లాంటి కన్నులు. లేడి కళ్ళు పెద్దవి; అవి అమాయకంగా ఉంటాయి; భయం వల్ల నిత్యమూ చురుకుగాకదులుతూ ఉంటాయి. ఆ కదలటం భయం వల్లే అయినా మనకి అది అందం గా ఉంటుంది. ఇది మామూలుగా చెప్పే సామాన్యార్థం.

లేడికి ఉన్న మరోప్రధాన గుణం సంఘ జీవనం. అవి ఎప్పుడు గుంపులలో తిరుగుతాయి. నావాళ్ళందరూ బాగా ఉన్నారా లేదా అని వాటి కళ్ళు నిత్యమూ కదులుతూ, చూస్తూ ఉంటాయి. ఎవరి కళ్ళు నిత్యమూ ఇతరుల క్షేమాన్ని చూసుకుంటూ ఉంటాయో - అదే మృగాక్షి!

మీనాక్షి అంటే చేప కన్నులు కదా? చేప తాను ఉంటున్న నీళ్లలోని నాచు వగైరాలు తీసేసి ఆ నీళ్లను పరిశుభ్ర పరుస్తుంది. అంతేకాక, అలలు ఎటు నడుపుతుంటే అవలీలగా అటు నడుస్తూ ఉంటుంది. అందువల్ల పవిత్రమైన హ్రదయం కలిగి, హ్రదయంలో ప్రతిఫలించే పరమాత్మ సంకల్ప తరంగాలకు అనుగుణం గా కదిలే కన్నులను సూచిస్తుంది ఈ నామం.

ఒక హ్రదయంలో ఉన్న పవిత్రత వారి కన్నులలో వ్యక్తం అవుతుంది. అయితే మహాత్ముల చూపు అందరిని పవిత్రం చేస్తూ ఉంటుంది. వారి హ్రదయం లో పరమాత్మ స్పందనలను ఆ కళ్ళు వ్యక్తం చేస్తాయి. అలంటి కళ్ళే మీనాక్షి కళ్ళు! ఇదే పరమార్థం.

అమ్మవారి కళ్ళలో -సామాన్యార్థం, పరమార్థం- రెండు ఉన్నాయి. ఆ తల్లి చల్లని చూపు మన మీద పడితే మన పాపాలు ఎండిపోతాయి. మనం పవిత్రులు అవుతాము.

(నవరాత్రి 1989; భక్తిమాల ఫిబ్రవరి 1991)

Tags: