మరణ సమయానికి మనిషికి ఏ ఆలోచన ఉంటుందో, దాన్నిబట్టి అతని పై జన్మ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రాణం పోయి సమయానికి మనం భగవంతుడి గురించి ఆలోచించగలిగితే మనం తప్పక భగవంతుడిని చేరగలం.
కానీ, ఆ మరణ వేదనలో దైవ చింతనం కలగడం ఎలా సంభవం? మన జీవితం లో మనకి మిక్కిలి ప్రియమైనది, అదే ఆ సమయానికి మన ఆలోచనల్లో దూరి కూర్చుంటుంది.
పగలు జరిగిందంతా రాత్రి గుర్తుండదు. బాల్యంలో జరిగిందంతా యౌవనంలో వార్థక్యంలో గుర్తు ఉండదు. నీ దృష్టి లో అతి ముఖ్యమైన సంఘటనలు మాత్రమే ఒకటో రెండో జీవితాంతం గుర్తు ఉంటాయి. ఎందువల్ల? వాటిమీద నీకు గల ఆసక్తి. ఇదే కారణం.
మరి, మరణ సమయంలో నీకు భగవద్ స్మరణ ఉండాలంటే భగవంతుడిమీద నీకు అంత తీవ్రమైన ఆసక్తి ఉండాలి. మనసుకు ఈ భగవదాసక్తి పెంపొందాలంటే మంచి ఉపాయం ఒకటి ఉంది. నిత్యం నీ మనసులో ఆయన నామాలను స్మరించు. ఆయన కీర్తిని నెమరు వెయ్యి. ఇలా ప్రతీ రోజు జీవితాంతం చెయ్యాలి. ఈ ఉపాయం పేరే నామ సంకీర్తనం.
(భక్తిమాల జూన్ 1991)