శాస్త్రాలు, సద్గురువులు ఆత్మ తమలోని ఉందని పదేపదే నొక్కి చెపుతుంటే అది తమకు ఎందుకు అందదా అని సాధకులు నివ్వెర పోతూ ఉంటారు.
ఇందుకు కారణాలు అనేకమున్నా, ప్రధాన కారణం వాళ్ళ బహిర్ముఖత్వమే. బహిర్ముఖత్వం అంటే ఏమిటి? తమతమ విషయాల వైపుకు పరుగు తీస్తూ ఉండటమే ఇంద్రియాల స్వభావం. అలా పరిగెత్తే టప్పుడు అవి తమతోపాటు మనస్సును కూడా గుంజుకు పోతూ ఉంటాయి. విషయాలు ఇంద్రియాలు కలవగా జనించే సుఖమే శాశ్వత ఆనందం అనుకోని, భ్రమలో పడి మనస్సు సంతోషంగానే ఇంద్రియాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇదే బహిర్ముఖత్వం.
కాబట్టి, ఆత్మ దర్శనం కావాలనుకొన్నవారు ముందు ఇంద్రియాలను, మనస్సును బిగించాలి. దీనిని వివేక యుక్తమైన విచారణ శీలం ద్వారా సాధింపవచ్చు. కానీ, సద్గురు కృపవల్ల దీన్ని నిరాయాసంగా సాధించవచ్చు.
అయితే ఈ ప్రయత్నం లో పరాజయాలు, పరధ్యానాలు మీదపడి కుమ్మేస్తాయి. అయినా సాధకుడు నిరుత్సాహ పడరాదు. అతడు గురు కృప లభించే దాకా ప్రయత్నిస్తూ ఉండవలసిందే. లక్ష్యం సిద్ధించే దాకా సాగుతూనే ఉండాలి.
భక్తిమాల మే 1991