జడ స్వరూపుడైన జీవుడు దీర్ఘ స్వప్నముతో కూడిన సంసార కూపమునందు పడి - నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా బంధువులు, నా ధనము అని భ్రాంతి జ్ఞానముచే తిరుగుతున్నాడు. సూర్యుడు అస్తమించేక అంతటా గాఢాంధకారం అయి, నక్షత్ర వెలుగు కూడా కనబడదు. అలాగే వాడిలో జ్ఞాన మార్గము తెలియకుండా చేసే సత్త్వగుణం కూడా నశిస్తుంది. ఇట్టి బ్రాంతి వలన తన స్వరూపమే తనకు తెలియక దేహబుద్ధితో కూడిన అహంకారము లో మునిగి జీవుడు దుఃఖములతో కూడిన విషయ సుఖములను అనుభవించడం లో ప్రాకులాడుతాడు.
జీవుడు ఇట్టి మాయ నిద్రలో ఉండగానే మరణిస్తాడు. మల్ల జన్మిస్తాడు. మల్ల వెంటనే నిద్రిస్తాడు. ప్రపంచమంతా మాయ నిద్రలోనే చూస్తాడు . ఈ విధముగా అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఈ జీవుడు పరమాత్మ తత్త్వ విచారము తెలుసుకోలేకపోవుట వలన నానావిధ కష్టములలో పడి దుఃఖిస్తాడు.
దుఃఖమును నాశనము చేయడానికి సులభ మార్గము తెలియజేసే ఆధ్యాత్మిక గ్రంథములు చదివితే నిజమయిన జ్ఞానము కలుగుతుంది. దుఃఖము తొలగుతుంది. దేవా ప్రార్థన, పరబ్రహ్మ ధ్యానము ఇవి కూడా మహా సులభమయిన మార్గాలు దుఃఖము తొలిగించడానికి .
(తెలుగు భక్తిమాల జులై 1980)