సమస్త దేవతల ధ్యానం కంటే పరమాత్మ ధ్యానమే అతి గొప్పది. పరబ్రహ్మ ధ్యానము చేయువారు మర్మము తెలుసుకొని ధ్యానించినచో మహా సులభమార్గమని తెలుసుకోగలరు. అట్టి వారికి ప్రత్యక్షంగా బ్రహ్మసాక్షాత్కారము లభించును. ఇట్లు పరబ్రహ్మ ధ్యానము చేయువారికి సాధనా ఫలము కాలాంతమున తప్పక్క లభించును. (ఇదియే పూర్వ జన్మ సంస్కారం అని చెప్పబడును). పరబ్రహ్మ స్వరూప జ్ఞానము కలిగినవారికి సకలమైన వేదములు, వేదాంత శాస్త్ర ముల యొక్క సారము, బుద్ధి ద్వారా అనుభవమునకు వచ్చును.
పరమాత్మ అంతరమున, బాహ్యమున సమస్త మునకు ఆధారభూతమై అఖండముగాను అపారముగాను వ్యాపించి ఉన్నాడు. కానీ అది కర్మ చక్షువులకు అనుమాత్రమైనను కనిపించదు. అది ఒక చోటునుంచి మరి ఒక చోటుకు పోయేది కాదు. వచ్చేది కాదు. పెరుగుట, విరుగుట అనే వికారాలు ఉండవు. శాశ్వతముగా ఉన్నది. ఇట్టి రహస్యము ఆత్మా జ్ఞానానుభవము గల మహనీయులకు మాత్రమే తెలియును. కానీ అజ్ఞానులకు మాత్రము తెలియదు.
సద్గురు అనుగ్రహమువలన ఈ రహస్యమును తెలుసుకొని సాధించిన వారికి ఆత్మానుభవము గలుగును. అప్పుడు మాయ తొలిగిపోవును. జ్ఞానోదయము అవును. అంటే సర్వ వ్యాపకుడు అయినా పరమాత్ముని సంబంధ మైన జ్ఞానము కలవాడై ఈ పంచభూతములతో ఉత్పత్తి అయి, క్రీడా వినోదములతో కూడిన జగత్తును అనిత్యమనియు, అసారమనియు, తెలుసుకోగలడు. ఇట్టి జ్ఞానము మహా ధనము. దీనిని చోరులు దొంగలించలేరు. దానికి రాజ భయముగాని, అగ్ని భయముగాని, క్రూరమృగ భయముగాని ఉండదు. అది జన్మ జన్మాన్తరములలో శాశ్వతానుభవముగా ఉందును.
పరబ్రహ్మ ధ్యానమే సంసార సాగరమను అజ్ఞానఅంధకారానికి జ్యోతి. ఇది మానవులను ఈ సాగరము నుండి ఆవలి గట్టుకు చేర్చును.
పరబ్రహ్మ స్వరూపము ఇట్టిదని వర్ణించడానికి సాధ్యము కాదు. అది మనస్సునకు, బుద్ధికి అతీతము. ఈ దృశ్య జగత్తుకు అతీతము.
(తెలుగు భక్తిమాల మార్చ్ 1980)