మనం ఇప్పుడు ఒక త్రిశంకు స్వర్గం లో ఉన్నాము. మనకు మన సంస్కృతీ లో ఉండే మహత్వం తెలియదు. పాశ్కాత్య సంస్కృతీ లో ఉన్న మంచి చెడు తెలియదు. మనకొక సరియైన సాంస్కృతిక లక్ష్యం లేదు. ఇది నిజానికి ఒక సాంస్కృతిక వ్యాధి అని చెప్పవచ్చు.
దీనివల్ల మనం ఉన్నత ప్రమాణాలకూ, ఉత్తమ శుభాలకు రెండిటికీ కూడా దూరమవుతున్నాము.
ముందు మన లక్ష్యాలు మనకి స్పష్టం కావాలి. అప్పుడే జీవితం అర్థవంతం అవుతుంది. లక్ష్యాలు అంటే కోరికలు కావు. కోరికలే గుర్రాలయితే గుడ్డివాడే సవారి చేసినవాడు అవుతాడు. కనుక లక్ష్యం అంటే చిత్త శుద్ధి గల సాధన. ఎదురు కాగల అవరోధాల గురించి పరిపూర్ణ మైన అవగాహన గల సాధన అదే లక్ష్యమంటే.
ఈ లక్ష్య శుద్ధి మనకు సిద్ధించాలంటే మనము ఏమి చెయ్యాలి? మహితాత్ములైన సద్గురువులు నడిచిన బాటన నడవాలి. సత్పురుషులు లోకం లో ఇంకా ఉన్నారు. వారిని గుర్తించాలి. వారిని సద్గురువులుగా భావించి, వారికి నిర్నిబంధంగా ఆత్మార్పణ చేసుకోవాలి. వారి కృపవల్ల దేశాల, కాలాల, ఎల్లలకు అతీతమైన, శాశ్వతమైన ధర్మతత్వం గ్రహించాలి. అప్పుడు ఉన్నత ప్రమాణాలతో జీవిస్తూనే, ఉత్తమ సుఖాలను అనుభవించగల కిటుకు అవగతం మవుతుంది. అప్పుడు త్రిశంకు స్వర్గం పోయి, అసలు స్వర్గం మన ఇంటి ముంగిట వాలుతుంది.
భక్తిమాల మార్చ్ 1991