ఈ ప్రపంచంలో బతకాలంటే మనకు బంధువులు, మిత్రులు ఉండాలి- అని అందరూ అనుకుంటూ ఉంటారు; అయితే నిజమైన బంధువు ఎవరు? ఈ విషయంలో మానవుల అభిప్రాయాలు నిరంతరం మారుతూనే ఉంటాయి.
పాలుతాగే పసిపిల్లకు తల్లే బంధువు. కొంతవయస్సు ముదిరి లోకంలో తిరిగ నేర్చిన కుర్రవాడికి తల్లి అంత ముఖ్యమైన బంధువు కాదు. తనకు కుటుంబం ఏర్పడినాక, తనకు తన పిల్లలే ముఖ్యమవుతారు. ఒకొక్కసారి తన తల్లే శత్రు కూడా కావచ్చు. ఇలా బంధువులు మారిపోవటానికి కారణమేమిటి?
వీరెవరూ మనకి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వగలవారు కాదు. అందువల్లే వారిపట్ల మన ద్రుష్టి మారిపోతూ ఉంటుంది. తాత్కాలికంగా అయినా మనం వారి మీద ప్రేమపెట్టుకోవడానికి కారణం మనకి సరియైన వివేకం లేకపోవటమే. సరిగా ఆలోచిస్తే వివేకం గల మనస్సే మనకు నిజమైన బంధువు. ఎందుకంటె- అది మనలను ఉద్ధరిస్తుంది. శాశ్వత సుఖానికి దారి చూపిస్తుంది.
కనుక, వివేకంగల మనస్సు తో మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి.
(భక్తిమాల ఫిబ్రవరి 1992)