SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
9. మనమంతా యీ మాయా కల్పిత ప్రపంచంలో కొట్టుకుంటూ బ్రతుకుతున్నాము. స్వామీజీ సన్నిధిలో ఆయన ప్రసంగాలు వింటూ ఈ కల్పితమాయా లోకాన్ని అర్థం చేసుకుంటున్నాము అని అనిపిస్తుంది. ఇది నిజం కూడా కాని బయటకు వచ్చాక తిరిగి లోక వ్యవహారాలలో కూరుకు పోయి, క్రోధ, లోభ, అహంకారలతో చిక్కుకుని పోతాము. మన కర్మలు మనల్ని అథః పాతాళానికి తీసుకుపోతాయి. ఇది ఎలా దాటాలి.

ఏదయినా పెద్దజబ్బు చేస్తే డాక్టరు కఠినమైన పద్ధతులు చెయ్యాలంటాడు. మనం చేయ్యలేము. కుర్చుంటే నడుంనొప్పి, నుంచుంటే కాళ్ళనొప్పి, శ్రీచక్రపూజ తీర్థం తీసుకుంటే జలుబు చేస్తుంది. హారతి తీసుకుంటే వేడి తగులుతుంది.

నువ్వు అసలే లోభివి. కాని బంధువులు, స్నేహితులు కావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళకి భోజనం పెట్టాలి. ఎలా, నా మనస్సు కొట్టుకుంటుంది. ఖర్చు పెట్టాలంటే.

కోరికలను అదుపులో పెట్టుకో గలిగితే చాలు. లోకంలో వుంటూ మాయను జయించాలంటే కష్టం నువ్వు డబ్బు, ఇల్లు, భార్య, పిల్లలు, వీటితోనే తగులుకుంటూ వుంటే ఆధ్యాత్మకంగా ఎలా ఎదుగుతావు. మాయను ఎలా జయిస్తావు. మరణావస్థలో కూడా ఇల్లు, డబ్బు, పిల్లల కోసమే ఆలోచిస్తావు. నీకు పురోగతి ఎప్పుడు వస్తుంది. మాయను ఎలా దాటగలవు. ఇదే నిజమైన సాధన.

నా చిన్నతనంలో జయలక్ష్మీ మాత బంగారు పళ్ళెం నిండా రకరకాల రుచికరమైన వంటకాలు వడ్డించి, మధ్యలో కొద్దిగా అన్నం చారు వడ్డించి ఒక చారు అన్నం మాత్రం తినమంది.

మిగితా వస్తువులు చూసినా కోరిక పుట్టరాదు. నోటిలో నీళ్ళురారాదు. వాటిని నిరాశతో వదలడం కాదు. ఇష్టంతో మనస్ఫూర్తిగా వదలాలి అని చెప్పేది.

తిండికి కూడా గతి లేని వాడు అభోజనంతో వుంటే అది కోరికలు వదిలినట్లు కాదు. భోజనం బాగా దొరికినా కూడా తినకుండా ఉపవాసం చేస్తే అదీ సంతోషంగా చేస్తే అదే కోరికలను జయించడం నువ్వు మౌనవ్రతం చేస్తే అది నలుగురి మధ్యలో వుండి చెయ్యాలి. అదే సాధన.

శ్రీరామ కృష్ణ పరమహంస తన శిష్యులతో –నోటిలో పటిక బెల్లం పెట్టుకుని కొరకకుండా, నోటిలో నీళ్ళు వూరకుండా 6 గంటలు కనుక వుంటే దానినే ఇంద్రియ నిగ్రహం అంటారని చెప్పారు.

రుచికి ఆవకాయ కావాలి. చలివేస్తే కంబళి కావాలి. చుట్టూ పిల్లలు వుండాలి. మరి మాయను ఎలా దాటుతావు.

ఇద్దరు పిల్లలు పుట్టాక మాయను జయించాలి. అన్ని వదిలేస్తాను అంటే నీ భార్య దెబ్బలాడుతుంది. నీ బాధ్యతలు నువ్వు చెయ్యాలి. వాటిని వదిలిపెడితే అది ద్రోహం చేసినట్లే, కనీసం వృద్ధాప్యంలో నయినా అధ్యాత్మిక పురోగతి సాధిస్తే నా జీవితానికి శాంతి దొరుకుతుంది. ఉత్తమగతి ప్రాప్తిస్తుంది.

Tags: