ముందు నుంచి ఆ ప్రసంగాల మీద ఇష్టంలేక శ్రద్ధగా వినలేదు. కనీసం చెప్పే వ్యక్తిమీద అభిమానంతో ఒక్క సందేశం వినుంటే క్రమంగా నీకు అర్థం కావడానికి అవకాశం వుండేది. అయినా అన్నం వుడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చాలు. వంటంతా తినక్కరలేదు. కాని నువ్వు ఎన్నో ప్రసంగాలు విన్నావు. కానీ ఏదీ అనుభవంలోకి రాలేదు. నీ మనస్సు ఒక ప్రసంగాల గోడౌనులా అయ్యింది.
శ్రవణం, మననం, మథనం చాలా విశేషమైనవి, శ్రవణం అంటే శ్రద్ధగా వినడం, మననం అంటే చక్కగా ధారణ చెయ్యడం, మథనం అంటే అర్థం చేసుకొని ఆచరించడం. నువ్వు విన్నదాంట్లో ఒక్క 5శాతం అయినా ఆరంభించి వుంటే బాగుండేది. ప్రసంగాలు వింటావు కాని ఆచరణలో పెట్టడానికి నువ్వు సోమరిపోతువు.