SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
ఎమ్. శకుంతల, గుంటూరు (M.Sakuntala, Guntur)

1986లో మా పొరుగువారు అనఘాష్టమీ వ్రతము చేసుకుంటున్నారు. ఈ పూజ ఈ కాలంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచేత ప్రచారం చేయబడింది. ఆ సమయంలో మాకు శ్రీ స్వామీజీ వారి గురించీ కానీ దత్తాత్రేయస్వామి గురించి కానీ తెలియదు. మేము దత్తదర్శనం చలనచిత్రం చూసినందు వలన వారితోపాటూ అనఘావ్రతం చేయాలని అనుకున్నాము.

1987లో నేను మొట్టమొదటి సారి శ్రీ స్వామీజీ వారిని “అన్న శ్రీనివాస కళ్యాణ మంటపం"లో చూశాను. ఆ సమయంలో నాకు విపరీతమయిన మైగ్రెయిన్ తలనెప్పి వుండేది, కానీ శ్రీస్వామీజీ వారిని చూసిన మొదటిసారే నాకు ఈ మైగ్రెయిన్ రహస్యంగా మటుమాయమయింది. మా కుటుంబంలో శ్రీ షిర్డీసాయిబాబా వారిని దర్శించడం ఆచారం, కానీ శ్రీ స్వామీజీ వారితో పరిచయం అయినప్పటినుండి మేము వారి ఆశ్రమాలను దర్శించుకోవడం మొదలుపెట్టాము.

మా అబ్బాయి సీతారామ్ ప్రస్తుతం శ్రీ స్వామీజీ వారికి తోడ్పడుతూ, అప్పుడప్పుడూ వారితో పాటూ పర్యటనలు చేస్తూ వారిపై చాలా ఆకర్షితుడయినాడు. శ్రీ స్వామీజీ వారికి మొదట అర్పించిన తరువాతే తను భోజనం చేస్తాడు. ఒకరోజున తన కాఫీని శ్రీస్వామీజీ వారికి అర్పణ చేస్తున్న సమయాన అతని చేతిమీద బల్లిపడి అతన్ని చాలా తీవ్రంగా కొరికి వేసింది. దానితో విపరీతంగా రక్తం కారసాగింది. అందరూ అది విషపూరితమనీ వెంటనే తగిన వైద్యం చేయించమని తెలిపినా, మా అబ్బాయి మాత్రం శ్రీ స్వామీజీ వారు తన రక్షణ చూస్తారనీ వైద్యుని దగ్గరకు వెళ్లడానికి నిరాకరించాడు. ఈ విశ్వాసంతో అతనికి ఏమీ జరగలేదు. ఆ తరువాత నుండి మా యింట్లో అనఘాష్టమీ వ్రతం నలబై, అరవై, తొంభై రోజులపాటూ ఆచరించటం సర్వ సాధారణమయింది.

మా యింట్లోని ముఖ్యమయిన ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుకు శ్రీ స్వామీజీ వారి ఫొటో ఒకటి వ్రేలాడుతూండేది. ఒకరోజూ సీతారామ్ భజనయోగం మొదటి భాగాన్ని గురించి సూచిస్తూ “నాకు శ్రీస్వామీజీ వారు వేలం వేయడం నచ్చలేదు” అంటూ స్విచ్ బోర్డుమీద చరచసాగాడు. ఒక్క క్షణంలోనే విద్యుత్తు అతని శరీరంలోకి ప్రవేశించి ఫ్యూజ్ ప్లగ్ విరిగి పడిపోయింది. స్విచ్ విరిగిపోయిన కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయి, పిల్లవాడు మెయిన్ బోర్డునుండి దూరంగా విసిరివేయబడ్డాడు. ఈ విచిత్రాన్ని చూసి మేము అతనికి ఘోరప్రమాదం జరిగిందనుకుని భావించాము. కానీ అతను మాత్రం చిన్న చిన్న మంటల గాయలతో బాధపడ్డాడు.

ఈ సంఘటన జరిగిన నుండి మా అబ్బాయికి స్వామీజీ వారిపై నమ్మకం బలీయమైపోయి మాతోటి తనకు స్వామీజీ వారిని చూడాలని వుందనీ, వారి వద్దనే వుండిపోవాలనుకుంటున్నానని తెలిపాడు. అతను దత్తస్తవం చదువుతూ స్వామీజీ వారితో మాట్లాడే అవకాశం కలగాలనీ కోరసాగాడు. ఆ తరువాత మేము విజయవాడకు శ్రీ స్వామీజీ వారిని దర్శించుకోవడానికి వెళ్ళి వారితో యింటర్వ్యూను కోరాము. మమ్మల్ని దత్తస్తవం చదవమని తెలిపారు. మేము చాలా మార్లు పారాయణ చేశాము. ఆ రోజు మేమంతా ఉపవాసం వున్నందు వలన మా కుటుంబమంతా అరటిపండ్లకోసం బయటకు వచ్చాం. యింతలో శ్రీస్వామీజీ వారు మిగతా భక్తులందరికీ దర్శనం యిచ్చారు. మేము మంచి అవకాశం పోగొట్టుకున్నామని, ఆహారం కోసం వెంపర్లాడామని బాధపడుతూ మేము కొన్న వాటినన్నిటిని విసరివేశాము. మమ్మల్ని లోపలికి అనుమతించమని పదే పదే విన్నవించుకున్నా, ఎవ్వరినీ వారిని కలవాడినికి లోపలికి అనుమతించమని తెలిపారు.

చివరికి మమ్మల్ని శ్రీ స్వామీజీ వారిని కలిసి మాట్లాడడానికి అనుమతించారు. మేము మా చిన్నబ్బాయి సీతారామ్ అనారోగ్యంగా వున్నాడనీ అతను ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాడని తెలిపాము. శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని వేసవికాలంలో మైసూరు ఆశ్రమంలో వారంరోజులపాటూ వుండమని తెలిపారు. ఆ సాయంత్రం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వారు “ఒక కుటుంబం దత్తస్తవం చదువుతూ ఇంటర్వ్యూ కోరుకున్నారు. కానీ శ్రీస్వామీజీ వారు వాళ్ళను చాలా పరీక్షీంచారు, వాళ్ళు ఆహారం కోసం బయటకు రాగా స్వామీజీ ఉద్దేశ్యపూరకంగా యితర భక్తులను లోపలికి పిలిచారు. వాళ్లు బాధపడి వాళ్ళ ఆహారాన్ని విసిరివేశారు. నేను వాళ్లమీద జాలిపడి వాళ్లను లోపలికి పిలిచాను” అని తెలిపారు. వారి సర్వవ్యాపకత్వానికి మేము ఆశ్చర్యపడుతూ మా చుట్టూ వున్న ప్రతి ఒక్కరికీ స్వామీజీ వారు మమ్మల్ని వుద్దేశిస్తూ మాట్లాడారని తెలిపాము.

వారు నిర్దేశించిన ప్రకారము మేము మైసూరు అశ్రమానికి వేసవికాలంలో వెళ్లాము. మా అబ్బాయి సీతారామ్ కు ఒక అద్భుతమయిన కల వచ్చింది. ఆ కలలో అతనికి శ్రీస్వామీజీ వారు చేతులనిండుగా మందులు యిచ్చారు. అప్పటి నుండి మా అబ్బాయి తన ఆహారాన్ని సరిగ్గా తీసుకోసాగాడు. ఒకరోజున అతను శ్రీస్వామీజీ వారిని మైసూరులో వారి సేవకై వుండాలని వున్నదని తెలిపాడు. దానికి శ్రీ స్వామీజీ వారు యిక్కడ అందరూ నిన్ను పరీక్షిస్తారు. ఈ అశ్రమంలోని జీవం లేని స్తంభాలు కూడా నీతో యుద్ధం చేస్తాయి. మరి నీవు అన్నిటినీ భరించగలవా? అని అడిగారు. మా అబ్బాయి అంగీకరించాడు. శ్రీ స్వామీజీ వారు అతనికి వడుగు చేయవలసినదని తెలిపారు. వారు ఆజ్ఞను మేము అనుసరించి మేము అ క్రతువును చేసి మా అబ్బాయిని వారి సేవకై అక్కడ వదిలాము. శ్రీ స్వామీజీ వారు తెలిపినట్లే మా అబ్బాయి చాలా అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఎప్పుడయినా యింటికి తిరిగి వచ్చేయాలని అనుకున్నప్పుడు స్వామీజీ వారు తన మనసును చదివినట్లు వారి చిరునవ్వును చిందించేవారు.

సద్గురు దేవులను కలవకముందు మా యింటికి ఒక మూగ అతను వచ్చి ముందు జరగబోయే వాటిని తన సంజ్ఞల ద్వారా తెలిపేవారు. ఒకసారి మేము అతనిని మా యింటికి ఎందుకు రావడం మానేశారని అడుగగా అతను తన సంజ్ఞలతో పెద్ద గడ్డముతో వున్న వారు మీ యింటికి రాబోతున్నారు, ఆయనే మీ గురువు ఆయనే నన్ను లోపలికి రానీయడం లేదని తెలిపారు. అప్పుడు మేము ఒక్క గురువుకే కట్టుబడి వుండాలన్న విషయాన్ని గ్రహించి యితర గురువుల వద్దకు వెళ్ళడం మానివేశాము. మేము షిరిడీ వెళ్ళడం కూడా మానేసాము దానికి కారణం మైసూరు ఆశ్రమంలోనే కావలసినదంతా వున్నది. యిప్పుడు శ్రీ స్వామీజీ వారే మాకు సమస్తమూ. నేను సినిమాలకు బానిసను. నేను శ్రీ స్వామీజీ వారినే ఆ తెరమీద చూస్తూ చలనచిత్రాలను చూడడం మానేశాను.

ఒకసారి సీతారామ్ కొంత కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాడు. శ్రీ స్వామీజీ వారు మా యింటి పురోహితుడికి కలలో అగుపించి “సీతారామ్ కు కొంత చెడ్డకాలం వుంది, కాబట్టి సీతారామ్ కోసం నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశంగా యిస్తాను. దానిని శాస్త్ర ప్రకారం చేయండి.” అని చెబుతూ స్వామీజీ వారు ఆ మంత్రం యొక్క అర్థాన్ని వారికి వివరించారు. ఆ పురోహితుడికి ఎన్నడూ స్వామీజీ వారి మీద నమ్మకం లేదు. అతనికి యిలాంటి కల రావడం మొదటిసారి. ఆ మరునాడు అతను మా యింటికి వచ్చి శ్రీ స్వామీజీ వారు నన్ను రాత్రంతా నిద్రపోనీకుండా నాకు చేయవలసిన చాలా విధానాలను తెలిపి నాకు ఉపదేశం చేశారు. అది ఖచ్చితంగా స్వప్నంకాదు. శ్రీ స్వామీజీ వారు నా ముందర కూర్చూని నన్ను ఆ మంత్రం చదవవలసిందని తెలిపారు. నేను ఈ మంత్రం గురించి ´మంత్ర తంత్రము` అనే గ్రంథాన్ని పరిశోధన చేయగా, అది శక్తివంతమైన ´రాజమాతంగి´ మంత్రమని గ్రహించాను. శ్రీ స్వామీజీ వారు నాకు విశదంగా వివరించారు. నేను ఎన్నటికీ ఆ మంత్రాన్ని మరచిపోలేను” అని తెలిపారు. ఆ పండితుడు అప్పటి నుండి శ్రీస్వామీజీ వారి ఆదేశాలను పాటిస్తూ వారి శిష్యులయినారు. ఈ విధంగా శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని మా కష్టసమయాలలో ఆదుకున్నారు.

ప్రతిరోజూ రాత్రి మేము శ్రీస్వామీజీ వారికి కాకడ హారతి జరుపుతాము. ఒకసారి మేము ఈ క్రతువు చేయటం మరచిపోయాము శ్రీ స్వామీజీ వారు మా పెద్దబ్బాయి సాధారణంగా రాత్రి షిఫ్ట్ పనిచేస్తాడు. అతనికి కలలో కనిపించి మేము కాకడ హారతినివ్వడం మరచిపోయామని తెలిపారు. వెంటనే అతను యింటికి వచ్చి కాకడ హారతినిచ్చాడు. మేము అతన్ని ఈ విషయం ఎలా తెలుసును అని అడిగాము దానికి అతను శ్రీస్వామీజీ వారే తనకు అగుపడి తెలిపారని సమాధానమిచ్చాడు. అతను శ్రీ స్వామీజీవారి చిన్న చిత్రాన్ని తన జేబులో పెట్టుకుని తన పని ప్రారంభం చేసే ముందు ఆ చిత్రానికి ప్రార్థన చేస్తాడు.

ఒకరోజున అతనికి శ్రీ స్వామీజీ వారు నేను మీ యింటిని యివాళ వదిలివేస్తున్నాను అని చెప్పినట్లనిపించింది. అతను యింటికి తిరిగి వచ్చి దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు. అప్పుడు మాకందరికీ అది మేము చేస్తున్న అనఘావ్రతపు నలభయ్యవ రోజని జ్ఞాపకం వచ్చి మేము ఆ కలశాలకు ఉద్వాసన జరిపాము. అంటే వారి మాటలలో వారు మా యింట్లో నలభైరోజుల పాటూ వున్నానని తెలిపారు. అప్పటి నుండి మేము ఎప్పుడూ కలశాలను ఏర్పాటు చేసి అనఘావ్రతం నలభై, అరవై, తొంభై రోజుల పాటూ శ్రీస్వామీజీ వారూ మా యింట్లో వుంటారని తలుస్తూ ఆచరిస్తూ వస్తున్నాము. మేము మా యింటి చుట్టు ప్రక్కల వారి యిళ్లకు వెళ్లి అనఘా వ్రతాన్ని వారిచే ఆచరింపచేసేవాళ్లము.

శ్రీ స్వామీజీ వారు మా యిద్దరి ఆడపిల్లలకు వివాహ సంబంధాలు కూడా సూచించారు. మా అల్లుళ్లకు వారి అనుగ్రహం వలన మంచి ఉద్యోగాలు లభించాయి. మేమూ ఏదయినా ఆహారాన్నీ ముందుగా శ్రీ స్వామీజీ వారికి అర్పించి తరువాత మేము తీసుకుంటాము. వారే మాకు గురువూ సమస్తమూ. మా అనుభవాలు అంతులేనివి.

జయ గురు దత్త

Tags: