SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
మక్కం రామాంజనేయులు, ప్రొద్దుటూరు మరియు ఎమ్.సుప్రియ, మైసూరు (Makam Ramanjaneyulu,Produttur and M Supriya, Mysore)

మా కుటుంబం మొట్టమొదటిసారిగా జనవరి 1980లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని ఆళ్లగడ్డలో కలుసుకున్నాము. అప్పుడు నా వయస్సు మూడు సంవత్సరాలు. ఆ సమయంలో మా నాన్నగారు హేతువాది. శ్రీ స్వామీజీ వారిని కలిసిన మరుక్షణం వారి జీవితం స్థిరంగా మారిపోయింది. మా నాన్నగారు శ్రీ సోమసుందర శర్మగారిని కలవడానికి వెళ్లారు. వీరు శ్రీ స్వామీజీ వారి పూర్వాశ్రమ ఉపాధ్యాయులు. తరువాత వీరు స్వామీజీ వారికి ప్రగాఢ భక్తులయినారు. నాదీ మరియు మా చెల్లెలి జాతకాలు ఒక జ్యోతిష్కులు రాశారు. కానీ మా తమ్ముడు 1979లో పుట్టిన సమయానికి ఆ జ్యోతిష్కులు జీవించిలేకపోవడంతో మా నాన్నగారు చాలా జాగ్రత్తగా వెతుక్కుని వివరాలు తెలుసుకున్న అనంతరం శ్రీ సోమసుందర శర్మగారి వద్దకు మా తమ్ముడు జాతకం వ్రాయించడానికి వెళ్లారు.

ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలలో వారు మా నాన్నగారికి వారి గురువుగారు త్వరలో ఆళ్లగడ్డ వస్తున్నారనీ, మీరు కూడా వచ్చి వారిని కలువవచ్చును కదా అని మా నాన్నగారిని అడిగారు. మా నాన్నగారికి అంత శ్రద్ధ లేకపోయింది. ఆయన పూజలను భగవంతుడిని లక్ష్యపెట్టవారు కాదు. మా అమ్మగారు ఆయనకు ఉదయంపూట ఉపచారాలు చేస్తేనే గానీ పూజలు చేసే ఆస్కారం వుండేదికాదు. ఆయన అమ్మని ముందు నాకు అల్పాహారం పెట్టిన తరువాత నీ యిష్టం వచ్చినంత సేపు పూజ చేసుకోని తెలిపేవారు. ఆయన శర్మగారికి నాకు యిలాంటివంటే నచ్చదనీ, ఏదైనా ఆర్ధికంగా సహకారం కావాలంటే చేస్తానని, ఎంత డబ్బు కావాలో చెబితే ఏర్పాటు చేస్తానని, తనని మాత్రం రమ్మని అడగవద్దని, నాకు వాటిమీద ఆసక్తి లేదని చెప్పారు.

ఒకరోజున శ్రీ స్వామీజీ వారు విచ్చేసిన సందర్భంలో, మా నాన్నగారు పని హడావిడిలేక కాస్త ఖాళీగా వున్న సమయంలో, వారు ఆళ్లగడ్డకు జీపులో వెళ్లారు. అక్కడ స్వామీజీ వారి సహాయకులు కొంతమంది, పర్వతశ్రేణిలో వున్న నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళడానికి జీపుకోసం వెతకుతున్నారు. వాళ్లు ప్రత్యేకించి జీపుకోసమే వెతకసాగారు. జీపులో ప్రయాణం వలన కుదుపులు తక్కువగా వుంటాయని, ఆ మార్గమంతా ఎత్తుపల్లాలతో కూడికుని వుంటుందని, వారు జీపు వెనుక భాగంలో తమ సామానును కూడా పెట్టుకుని వెళ్ళడానికి వీలుగా వుంటుందని ఆలోచిస్తున్నారు. ఆ రోజులలో జీపులు కొన్నే వుండి దొరకడం కష్టంగా వుండేది. పైగా ఎన్నికల ప్రచారానికి వాటిని వాడుతుండడంతో జీపులు దొరకడం కష్టంగా వుండేది. మా నాన్నగారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన జీపును వినియోగించుకుంటామని అడిగారు. దానికి ఆయన నేను అలాంటి వాడిని కాననీ, నేను కేవలం స్వామీజీ వారిని చూడడానికి వచ్చానని తెలిపారు. దానికి వాళ్లు మేము కూడా ఆ స్వామి వారికి సేవ చేయడానికి వచ్చామని తెలిపారు. యిది విని మా నాన్నగారు సరే నేను జీపును యిస్తాను కానీ, మీ స్వామీజీ నా ప్రక్కన కూర్చోవాలి ఎందుకంటే నేను వెనకాల కూర్చోను అని అన్నారు. శ్రీ స్వామీజీ వారు అలాగే అని ఒప్పుకున్నారు. వారు మనుషుల పొరపాట్లను వారి యొక్క అజ్ఞానం కారణంగా భరిస్తారు. వాళ్లు ప్రయాణం మొదలుపెట్టారు. యింకా పైకి వెళ్లే కొద్దీ వాళ్లు నడుచుకుంటూ చేతిలో కర్ర సహాయంతో ఆ కొండను ఎక్కవలసి వచ్చింది.

మా నాన్నగారికి గురువును గురించి గానీ, భగవంతుణ్ని గురించి కానీ బొత్తిగా తెలియదు. వాళ్లు నడుస్తున్న మార్గంలో వారు రెండు కొండల మధ్య నీటికొలనును ప్రాంతాన్ని దాటవలసి వచ్చింది. శ్రీ స్వామీజీ వారి పాదుకలు జింకచర్మంతో చేసినవిగా అనిపించాయి అందువలన వారు ఆ పాదుకలను పక్కగా విడిచి అవతల గట్టును చేరటానికి వెళ్లారు. మా నాన్నగారు అడగకుండానే ఆ పాదుకలను చేతిలోకి తీసుకుని, అవతలి గట్టుకు చేరాక శ్రీ స్వామీజీ వారికి తిరిగి యిచ్చారు. శ్రీ స్వామీజీ వారు ప్రశాంతంగా మా నాన్నగారి కళ్లల్లోకి చూస్తూ, చిరునవ్వు నవ్వి ఆ పాదుకలను ధరించారు. వాళ్లు ఆ కొండమీదకు చేరి నరసింహస్వామి ఆలయం చేరుకున్నారు. అక్కడ శ్రీ స్వామీజీ వారు మా నాన్నగారికి మంత్రోపదేశం చేశారు. మా నాన్నగారు ఏమీ తెలియకుండానే అంగీకరించారు. ఆ తరువాత శ్రీ స్వామీజీ వారు మా నాన్నగారికి మరునాడు కూడా రావాలని తెలిపారు. శ్రీ స్వామీజీ వారి ప్రవర్తన మా నాన్నగారికి నచ్చినందున అలాగే తప్పక వస్తానని సమాధానమిచ్చారు.

మరుసటిరోజు వాళ్లు యింకొక ఆలయానికి వెళ్ళారు. వాళ్లు ప్రొద్దుటూరు తిరిగి వస్తున్నప్పుడు వాళ్లిద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. వాళ్లు ప్రయాణిస్తున్నపుడు శ్రీ స్వామీజీ వారు మా నాన్నగారికి ప్రొద్దటూరు గురించి విశేషాలను తెలిపారు. మా నాన్నగారు అక్కడే పెరిగినా ఆయనకి ఆ విశేషాలు తెలియవు. వాళ్లు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. మా నాన్నగారికి ఏ పనీ లేకపోవడంచేత ఆయనకు పొగత్రాగడం అలవాటు వుండడంతో బయట నుంచుని పొగత్రాగడం మొదలు పెట్టారు.యింతలో హఠాత్తుగా ఎవరో వచ్చి శ్రీ స్వామీజీ వారు పిలుస్తున్నారని చెప్పారు. అక్కడ బోర్డు ట్రస్టీల సమావేశం జరుగుతోంది. శ్రీ స్వామీజీ వారు మా నాన్నగారితో ఈ రోజునుండి మీరు ఆశ్రమ నిర్వహణ బాధ్యతను చూసుకోవాలి అని చెప్పారు. మా నాన్నగారు సంకోచించకుండా తప్పక చేస్తాను అని చెప్పారు. ఆ తరువాత శ్రీ స్వామీజీ వారు మైసూరులో శివరాత్రి ఉత్సవాలకు రావలసిందని తెలిపారు.

1980వ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలకు మమ్మల్నందరిని మైసూరు ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు. అప్పటి నుండి మేమందరమూ మైసూరులో జరిగే ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటున్నాము. మా నాన్నగారు ఆయనకు ఏమీ తెలియకపోయినా శ్రీ స్వామీజీ వారితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారు. ఆ రోజులో వారు కడపలో అర్రాకు కాంట్రాక్టు చేసేవారు. కడపలో అయిదు రోజులపాటు శ్రీ స్వామీజీ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత ప్రొద్దటూరు నుండి శ్రీ స్వామీజీ వారిని అనుసరిస్తూ బొమ్మెపర్తి చేరుకున్నారు. అప్పుడు మా నాన్నగారు మొట్టమొదటగా ముట్టుకున్న శ్రీ స్వామీజీ వారి పాదుకలను మా నాన్నగారికి యిచ్చారు. పధ్నాలుగు రోజుల అనంతరం మా పర్యటన ముగించుకుని అనంతపురం గుండా, ఒక స్నేహితునికి సంబంధించిన దుకాణం వద్ద కాసేపు ఆగాము. మా నాన్నగారు ఆ పధ్నాలుగు రోజులు పొగత్రాగలేదు. ఆయన అక్కడ ఒక అబ్బాయిని పిలిచి సిగరెట్ పెట్టె తెమ్మని పంపిచారు. అప్పుడు మా నాన్నగారి స్నేహితులు గత పధ్నాలుగు రోజులుగా పొగత్రాగడం మానేసినందున యిక ముందర కూడా పొగతాగడం మానేయమని తెలపగా, మా నాన్నగారు సరే అని అప్పటినుండి యిప్పటివరకు ఎన్నడూ పొగ త్రాగలేదు.

నేను ఆశ్రమానికి 1980నుండి వస్తూనే వున్నాను. నాకు భక్తిగానీ, పూజా విధానంగానీ తెలియకపోయినా శ్రీ స్వామీజీ వారితో గడపడానికి యిష్టపడేవాన్ని. వారు మాతోపాటు ఆడుతూ, మాకు చాక్లెట్లు, వాచీలు, పెన్నులు వంటివి బహుకరించేవారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని శ్రీ స్వామీజీ వారి అష్టోత్తరం, లలితా సహస్రనామాలు, మరి యితర అష్టోత్తరాలను, స్తోత్రాలను నేర్చుకోవాలని మాతో కఠినంగా వుండేవారు. ఆ తరువాత క్రమంగా మేము శ్రీ స్వామీజీ వారిపై భక్తిభావం పెంచుకున్నాము. వారు చెప్పిన మాటలను తప్పక పాటించేవాళ్లము. పైన చెప్పిన పర్యటనలలో కడప నుండి ప్రొద్దటూరు చేరినప్పుడు అక్కడి భక్తులు శ్రీ స్వామీజీ వారికి ఆహ్వాన సూచకంగా లలితా సహస్రనామలను చదవడం మొదలు పెట్టారు. నేను ఆడుకుందామని పరుగులు పెడుతుండగా మా నాన్నగారు నన్నుపట్టి లాగి స్వామీజీ వారి దగ్గర కూర్చోబెట్టి నాకు పుస్తకాన్ని యిచ్చి మిగతా వారితో పాటు చదవమని చెప్పారు. నాకు యింక వేరే అవకాశం లేక నేను చదవడం మొదలుపెట్టాను. శ్రీ స్వామీజీ వారు నా వంక చాలా కరుణతో చూశారు.

స్వాగత సభ అనంతరం శ్రీ అప్పాజీ వారు తమ గదిలో నన్ను కూర్చోబెట్టుకుని ఎంతో సన్నిహితంగా నాకు ఏది కావాలంటే అది యిస్తానని తెలిపారు. యిలా ఒక పదిహేను నిమిషాల కాలం గడిచింది. నేను భయపడి తికమక పడుతూ నాకు ఏమీ అవసరం లేదు అని అన్నాను. కుసుమక్క మరియు మా అమ్మగారు నన్ను ఏదైనా కోరుకోమని బలవంతపెట్టసాగారు. కానీ నేను నాకు ఏమీ అవసరం లేదని పదే పదే చెప్పాను. పెద్దయిన తరువాత నేను వారు చెప్పినవి జరగాలని కోరేదానిని. పరీక్షల సమయంలో నేను పాసవ్వాలని ప్రార్ధన చేసుకునేదాన్నితప్ప ఏమీ కోరేదాన్ని కాదు. నాకు బాగా జ్ఞాపకం నాకు పదకొండు సంవత్సరాల వయసులో శ్రీ స్వామీజీ వారు మా తల్లిదండ్రులను పిల్లలను వేసవికాలం సెలవలు గనక ఆశ్రమంలో విడిచి పెట్లి వెళ్లమన్నారు. మా నాన్నగారు నన్ను కుసుమక్క దగ్గర వదలి వెళ్లారు. నేను శ్రీ స్వామీజీ వారంటే భయపడేదాన్ని. వారు నాతో నేరుగా మాట్లాడితే నేను తలను అవును, కాదు అని ఊపేదాన్ని. మాట్లాడేదాన్ని కాదు.

నాకు పదకొండు, పన్నెండు సంవత్సరాల వయసప్పుడు వేసవి కాలం సెలవలలో శ్రీ దత్తదర్శనం పుస్తకాన్ని మూడు రోజులలో నేను చదివేశాను. నాకు ఆడుకోవడం యిష్టం. నేను స్కూలులో చాలా అల్లరి చేసేదాన్ని. నేను స్కూలులో మొదట గానీ రెండవ ర్యాంకు గానీ సాధించేదాన్ని అందువలన టీచర్లందరు నన్ను యిష్టపడేవారు. నా పదమూడవ యేట హఠాత్తుగా నేను చాలా మౌనంగా మారిపోయాను. స్వామీజీ వారి మీద భక్తి భావం పెరిగి అల్లరి చేయడం మానేశాను. ఆ వేసవిలో నేను చాలా కొద్దిసేపు ఆటలు ఆడుకుని నా సమయమంతా గురునిలయంలో గడిపాను. శ్రీ స్వామీజీ వారు నన్ను పొద్దున్న, సాయంత్రం వారికి నమస్కారం చేయాలని ఆజ్ఞాపించారు.

ఉదయం పూట, నేను వారిని చూస్తూనే నమస్కారం చేసేదాన్ని. కానీ, రాత్రి పూట నేను వారి పిలుపుకోసం ఎదురు చూసేదాన్ని. వారు నన్ను రోజూ పిలిచేవారు. నేను నమస్కారం చేసి వెళ్లిపోయేదాన్ని. ఒకరోజున నన్ను కూర్చోమని చెప్పారు. నేను వారి పాదాల వద్ద కూర్చున్నాను. అప్పుడు వారు నన్ను నీ స్కూలు ఎలా వుంది? అని అడిగారు. వారేమడిగినా నేను నా తలని ఆడించాను. పది నిమిషాల తరువాత నన్ను వారు వెళ్లమన్నారు కానీ నేను నా మనసులోనే నేను వెళ్లను. మరికొంచెం సేపు వుంటాను అని సమాధానమిచ్చాను. మళ్లీ అలాగే జరిగింది. నేను స్పందించలేదు. తరువాత వారు నాతోటి యింక చాలు వెళ్లు అన్నారు. నేను నమస్కారం చేసి వెళ్లిపోయాను.

ఆ మరునాడు కుసుమక్కకు వారు మూడవసారి చెప్పేవరకు నేను కదలలేదని ఫిర్యాదు చేశారు. కుసుమక్క నన్ను అలా చేయకూడదని వారు చెప్పిన వెంటనే వారి మాటలను అనుసరించాలని చెప్పారు. నేను నా తలను పంకించి నా మనసులో ఎందుకు ఫిర్యాదు చేశారు. నేను వారు చెప్పిన వెంటనే వచ్చేసాను కదా అని అనుకున్నాను. కానీ వారు నా హృదయంలో కూడా చెప్పారని అర్ధం చేసుకోలేకపోయాను. నేను ఏదో పొరపాటు చేశానని, వారు ఎన్నడూ అబద్ధం చెప్పరనీ మౌనంగా వుండిపోయాను. నేను ఎదిగే కొద్దీ శ్రీ స్వామీజీ వారు హృదయాలలో మాట్లాడతారని తెలుసుకున్నాను.

1989లో నాకు పదమూడేళ్ల వయస్సులో ప్రొద్దటూరులోని ఒక ఆలయంలో దత్తప్రతిష్ఠకై శ్రీ స్వామీజీ వారు వచ్చారు. అప్పుడు వారు నా తోటి, నేను ఏదయినా తప్పు చేస్తే వారు నాతో మాట్లాడనని నన్ను నేను శిక్షించుకోవాలని తెలిపారు. అప్పుడు నేను అమాయకంగా నన్ను నేను శిక్షించుకోవాలంటే ఏం చెయ్యాలి అప్పాజీ అని అడిగాను. దానికి వారు భోజనం మానెయ్యి. లేకపోతే నిద్రపోవడం మానెయ్యి అని చెప్పారు. నేను నిద్రను ఆపుకోలేను కాబట్టి భోజనం మానడానికి నిశ్చయించుకున్నాను. వారు నాకు చెప్పినవేవి నేను యితరులకు, చివరకూ యింట్లోవాళ్లకు కూడా తెలపకూడదని చెప్పారు.

కొన్ని సంవత్సరాల తరువాత, ‘‘ఫాలో ద మాస్టర్’’ పుస్తకం చదివిన అనంతరం నాకు ఈ విధంగా తర్ఫీదు ఎందుకు యిచ్చారో అర్ధమయింది. నన్ను నేను శిక్షించుకోవడం, భోజనం మానేయడం, నిద్రమానడం వంటివి. మనసు దారి తప్పినప్పుడు శరీరానికి శిక్షవేసి సరిచేసుకోవడం, యిది ఎలాగంటే ఒక కాడికి రెండు ఎడ్లను కట్టడం వంటిది. స్వాధీనంలో లేని ఎద్దు స్వాధీనమవుతుంది. నా శరీరాన్ని శిక్షిస్తే బుద్ధి కూడా బలహీనపడుతుంది. ఈ విధంగ బుద్ధి స్వాధీనమవుతుంది.

మా నాన్నగారు వారితోపాటుగా అలహాబాదు పర్యటనకు బయలుదేరుతున్నప్పుడు నన్ను కూడా తీసుకు వెళ్లమని కోరాను. అక్కడికి వెళ్లిన తరువాత నేను చల్లనీళ్లతో స్నానం చేయాలని నిశ్చయించుకుని ఆ తరువాత ఆ నియమాన్ని కొన్ని సంవత్సరాలపాటు ఆచరించాను. నేను ఆ రోజున స్వామీజీ వారి వద్దకు వెళ్లినప్పుడు నేను మాములుగా నవ్వుతూ మాట్లాడాను కానీ, నేను వారికి నమస్కరించలేదు. ఆ తరువాత ఆ రోజంతా స్వామీజీ వారు నాతో మాట్లాడలేదు. నేను ఏదో పొరపాటు చేశాను అని అర్ధమయి ఆ రోజు మధ్యాహ్నం నేను భోజనం మానేశాను. భజనల అనంతరం స్వామీజీ వారు నాతో మాట్లాడారు. నేను మనం మన అంతరాత్మకు నమస్కారం తెలుపుతాము వారికి దాని వలన ఏమీ రాదు, యిది మనకు ఒక విధమైన క్రమశిక్షణను నేర్పుతూ గురువుతో ఎలా మెలగాలో తెలుపుతుంది.

నేను తరువాత సంవత్సరం వేసవి సెలవులలో ఆశ్రమానికి వెళ్లినప్పుడు స్వామీజీ వారు నన్ను ఒక ప్రదేశంలో నిలుచుని వుండమనీ, ఎవరయినా నన్ను తిడితే వారివైపు చూసి చిరునవ్వు నవ్వమని తెలిపారు. కుసుమక్క ముందర మరి కొంతమంది ముందర నేను అక్కడ అలా నిలుచుని వుండటం చూపిస్తూ నన్ను చూపించి స్వామీజీ వారు గేలి చేయసాగారు. అయినా నేను అక్కడ నుండి కదలకుండా నిలుచుని వుండడం చూసి నేను ఒంటరిగా వున్నప్పుడు మెచ్చుకున్నారు. అలాగు నన్ను యితరులు చూసి ఏమనకున్నా స్వామీజీ వారి పట్ల విధేయతను చూపడం నేర్పించారు. నన్ను యితరులతో అవసరమయితేనే నోరు విప్పి మాట్లాడాలని కూడా శాసించారు. నా చెల్లెలు మరియు యితర స్నేహితులంతా మాట్లాడుకుంటున్న సమయంలో నేను మాట్లాడాలని అనుకున్నప్పుడు నాకు ఎదురుగుండా స్వామీజీ వారు కనబడి నన్ను మాట్లాడవద్దని సంజ్ఞలు చేసేవారు. దానితో నేను మాట్లాడడం మానేసి ఏం చెబుదామనుకున్నానో మరచిపోయానని చెప్పేదాన్ని. వాళ్లంతా నన్ను ఒక వెఱ్ఱిదాన్ని చేసి పక్కకి తొలగిపోయేవారు.

1991లో అచ్చరపాకంలో దత్త ప్రతిష్ఠ సందర్భంగా వారు నన్ను వారితో ఒక భక్తురాలిగా లేదా కుమార్తెగా వుండాలనకుంటున్నావా అని అడారు. నేను ఆ రెండింటికి తేడా తెలియక ను తప్పు ఎన్నుకుంటానేమోనని వారిని నేను ఆ రెండు పదాలకి గల తేడా తెలపమని ఒత్తిడి చేశాను. ఆ తేడా తెలుసుకున్న తరువాత ఎంపిక చేసుకుంటానని చెప్పాను. కూతర్లు ప్రపంచంలోని వరాలకోసం వస్తారు. కానీ భక్తులు మానసికంగా స్వామీజీ వారి హృదయంలో వుంటారని చెప్పారు. అప్పుడు నేను భక్తురాలినవుతానని చెప్పాను. అప్పుడు వారు దానికోసం నిన్ను స్వామీజీ వారు పరీక్షిస్తారు చాలా కఠినంగా పరీక్షిస్తారు. అది ఎలా వుంటుందంటే గాయం మీద కారం చల్లినట్లుగా వుంటుంది అని చెప్పారు.

నేను భయపడకుండా అమాయకంగా అప్పాజీ ఒక వేళ మీరు పరీక్షిస్తే మీరు నన్ను తప్పక గెలిపిస్తారు అని తెలిపారు. వారు నవ్వుతూ అంగీకరించి యిది రహస్యమని ఎవ్వరికీ చెప్పవద్దని తెలిపారు. ఆ రోజు సాయంత్రం హాలులో కూర్చుని వుండగా శ్రీ అప్పాజీ వారు మా చెల్లెలితో, నా స్నేహితురాలితో మా అత్తయ్యతో మరియు నాతో సంభాషించసాగారు. అకారణంగా ఆయన వాళ్లతో చూడండి సుప్రియ అప్పాజీ వారి భక్తురాలవ్వాలనుకుంటోంది అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అంతకు ముందే అది రహస్యమని ఎవ్వరికీ చెప్పవద్దని నాకు చెప్పి, వారు అలా ఎందుకు చెప్పారో అర్ధంకాలేదు. చాలా సంవత్సరాల తరువాత అది నాకు వారు విధించిన నియమమని తెలుసుకున్నాను. నేను నా రహస్యాన్ని నేను కాపాడుకోవాలనీ, వారికి ఈ విషయమై ఎటువంటి నియమములేదు. మా చెల్లెలు ఈ విషయాన్ని మా అమ్మగారికి చెప్పింది. మా అమ్మగారు అప్పాజీ వారు పరీక్షిస్తారని భయపడింది. ఆయన ఎక్కడ కనబడితే అక్కడ సుప్రియ మీ పుత్రిక, భక్తురాలు కాదని చెప్పసాగింది. నేను ఆయన పుత్రికను కాదని వాదించసాగాను. శ్రీ అప్పాజీ వారు నన్ను కోప్పడి, నువ్వు నా పుత్రికవే యింక ముందర ఎప్పడు వాదించవద్దని తెలిపారు.

1991లో నేను విజయవాడలోని ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చేరాను. నేను ఉత్తీర్ణురాలినవ్వాలని, ఆరునెలల కాలం లలితా సహస్రనామాలని కంఠస్థం చేస్తూ మిగతా ప్రార్ధనలను విడిచి పెట్టాను. అప్పాజీ వారు విజయవాడ వచ్చిన సందర్భంలో నన్ను చూసి కోప్పడుతూ నేను నా ప్రార్ధనలు చేయడం లేదనీ, నేను ప్రార్ధనలు నిరంతరం చేస్తున్న కారణంచేత నన్ను వారి దగ్గరకు రానిస్తున్నానని తెలిపారు. నన్ను వారు కోప్పడినా నేను చింతించలేదు. నేను నా తలను వంచి అవతలి వారికోసం నిలుచున్నాను. ఆ తరువాత శ్రీ చక్రార్చన సమయంలో నేను కూర్చుని లలితా సహస్రనామం పుస్తకం చదవడం మొదలుపెట్టాను.

ఆఖరికి పూజ పూర్తయిపోయి స్వామీజీ వారు తీర్థం యివ్వసాగారు. అప్పుడు వారు లలితా సహస్రనామ పఠనంలో పోటీలు నిర్వహించాలని తెలిపారు. వారు తప్పులు లేకుండా చదివిన వారికి బహుమతిని కూడా యిస్తానని తెలిపారు. వారు నన్ను 4 గంటలకు కనబడమని చెప్పారు. అప్పటిదాకా లలితా సహస్రనామం చదువుతూ నాకు స్పష్టంగా రాకపోయినా నేర్చుకున్నాను. నామావళి అంతా నేను ఆరునెలల పాటు ప్రయత్నం చేసినా, కేవలం కొన్ని గంటలలో నేర్చుకోగలిగినందకు ఆశ్చర్యం కలిగింది. నేను వారిని కలిసినప్పుడు వారు నన్ను కేవలం పెదవలను మాత్రము కదుపుతూ చదవమన్నారు.

నేను కుసుమక్క తోటి వంటగదిలో వుంటూ చిన్నచిన్న పనులలో సహాయ పడేదాన్ని. ఎవరినయినా పిలవడంగానీ ఏదైనా అందిస్తుండడం గానీ చేసేదాన్ని. ఆ రోజున నాకు ఆవిడ ఏపనీ చెప్పలేదు. నేను వంటగది బయట నిలబడే వున్నాను. అందరూ స్వామీజీ వారి దర్శనంకోసం యింటర్వ్యూ రూము వద్ద క్యూలో నిలబడ్డారు. వారికి నేను దూరం నుండి కనబడుతున్నాను. నేను నా పెదవలను కదుపుతూ అక్కడ చాలా సేపు నిలబడి వుండడం అక్కడి వారంతా నన్ను వింతగా చూశారు. నేను అదేమీ పట్టించుకోలేదు. ఎందుచేతనంటే అప్పాజీ వారు నన్ను అలా చెయ్యమని చెప్పారు.

ఆ మరుసటి రోజు రాత్రి అప్పాజీ వారు నవ్వుతూ సరే, యిప్పుడు నీ మనసులో చదువుకో. ప్రతిరోజూ రోజుకు పదిసార్లు అలా చెయ్యి అని చెప్పి, స్వామీజీ వారి అష్టోత్తరం రోజుకు ఎన్నిసార్లు చదువుతావు అని అడిగారు. నాకు ఆయన కోప్పడతారనే భయం వేసి రోజుకు ఒకసారి అని చెప్పాను. ఆయన మంచిది అన్నారు. నేను రోజుకు పదిసార్లు చదివేదాన్ని. అప్పాజీ నాకు కనపడకపోతే నేను ఆ రోజున భోజనం మానేసేదాన్ని. వారు నాకు స్వప్నంలో రోజూ కనబడేవారు. ఒకవేళ నాకు కలలో కనబడకపోతే నేను భోజనం మానసేదాన్ని. నేను తరువాత శ్రీ స్వామీజీ వారి వద్దకు వెళ్లినప్పుడు వారు నన్ను వారిని కలలో కనపడాలని కోరుకుని వారిని యిబ్బంది పెట్టవద్దని తెలిపారు. నేను వారితో ఎన్నడూ ఏదీ చెప్పలేదు కానీ వారికి అంతా తెలుసు. వారు నన్ను వారిని ఏ ప్రశ్నలు అడగవద్దని చెప్పిన పని చేయమని ఆజ్ఞాపించారు.

1993లో కర్ణాటకలో ప్రవేశ పరీక్ష రాసినపుడు, మా నాన్నగారికి నాకు ఆంధ్రలో కూడా మెడిసిన్లో సీటు తప్పక వస్తుందని, నన్ను లాంగ్ టర్మ్ కోచింగ్ కై గుంటూరులో చేర్చారు. నేను అక్కడ వున్నప్పుడు వేడి నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకున్నాను. అప్పుడు నాకు శ్రీ స్వామీజీ వారు చన్నీటితో స్నానం చేయమన్నారని జ్ఞాపకం వచ్చి నేను మళ్లీ చల్లనీటితో స్నానం చేయడం మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలలో నా మనసుకు వచ్చిన ఆలోచనలను నేను ఆచరించేదాన్ని కాదు. నీకు చెవుడా? నేను చెప్పినది వినిపించుకోవేం? అని వారు నన్ను తిట్టేవారు., నేనుకుంటున్న మాటలేవో, స్వామీజీ వారు చెప్పే మాటలు ఏవో అని నాకు కొద్దిగా సందేహం కలిగేది. నేను వారిని అర్ధం చేసుకోసాగాను. అలాగే వారు నాకు హృదయాలతో సంభాషణ చేయడం నేర్పించారు.

1994లో నాకు జె. జె.ఎమ్ మెడికల్ కాలేజీ, కర్ణాటకలో సీటు వచ్చింది. అప్పాజీవారు నేను పరీక్షలు రాయక ముందే నాన్నకు కర్ణాటకలో అదీ దావనగిరిలోనే చదవితే చేస్తానని చెప్పారు. మా అక్క అక్కడే దంతవైద్య కళాశాలలో చదువుకునేది. అప్పటి నుండి నేను ఆశ్రమానికి ప్రతీనెలా వెళ్లేదాన్ని. ఒకసారి నన్ను సోమవారం నాడు కూడా వుండిపొమ్మని తెలిపేవారు. నేను వుండిపోయాను. ముఖ్యమయిన తరగతులు పోతాయని భయపడేదాన్ని. నేను మంగళవారం తిరిగి వెళ్లేసరికి నేను వదులుకోకూడదనుకున్న తరగతులు ఆ ముందురోజున జరిగేవి కావు.

అప్పటి నించి భయం లేకుండా వారు చెప్పిన ప్రకారం నేను వుండిపోయేదాన్ని. చాలామంది నేను మైసూరు వాసినని అనుకునేవారు. వారికి నేను ఆశ్రమం గురించి చెప్పినప్పుడు నన్ను వింత చూపులు చూసేవారు. శ్రీ స్వామీజీ వారు నన్ను ఆశ్రమాన్ని గురించి తక్కువగా ఆలోచించకుండా వారు నాకు అది నా మొదటి యిల్లు అని చెప్పమని నన్ను దృఢంగా తయారుచేశారు. నా పరీక్షలు, అప్పాజీ వారి పర్యటనలు ఎవరో ఏర్పాటు చేసినట్లు ఒకే సమయంలో జరిగేవి.

1996లో శ్రీ స్వామీజీ వారి కథాసాగరం కార్యక్రమం జెమినీ టివీలో ప్రసారం అవుతున్నప్పుడు, ఆశ్రమంలోని పిల్లలు జెమినీ టీవి వారికి ఆ కార్యక్రమ ప్రసారాన్ని కొనసాగించవలసిందని ఉత్తరాలు వ్రాసి కోరేవారు. నేను దాదాపు నాలుగు వుత్తరాలు వారికి మా స్వామీజీ వారి కార్యక్రమం, మా గురువుగారి కార్యక్రమాల ప్రసారం కొనసాగించవలసిందని వ్రాశాను. అప్పాజీ వారు నన్ను పిలిచి నువ్వు ఏమయినా ఉత్తరాలు వ్రాశావా అని అడిగారు. నేను వారికి మా స్వామీజీ వారి కార్యక్రమాలను ప్రసారం చేయాలని కోరానని తెలిపాను. నేను మా గురువుగారు అని చెబుతూ వ్రాసిన విషయాన్ని చెప్పడానికి కొంచెం భయపడ్డాను. వారు నన్ను పదే. పదే నేను మా గురువుగారి కార్యక్రమాలు అని చెప్పేవరకు రెట్టించసాగారు. వారు ప్రశాంతంగా నువ్వు నిజమే చెప్పావు అని అన్నారు. అప్పుడు నేను వారు 5 సంవత్సరాల తరువాత నన్ను శిష్యురాలిగా అంగీకరించారని అర్ధం చేసుకున్నాను.

నన్ను శిష్యురాలిగా అంగీకరించిన తరువాత వారు నాకు నా వ్యక్తిత్వాన్ని మలచుకోవడం, నా పని సామర్ధ్యతని అంగీకరించడం, నాలోని ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి నేను నా పనిని సమర్ధవంతంగా నిర్వహించడం నేర్పారు. వారు నాకు ఎవరితోనైనా మాట్లాడగలిగే శక్తిని యిచ్చారు. నేను అప్పాజీ వారి అనుజ్ఞ ప్రకారం కొన్ని సంవత్సరాల పాటు ఎవరితో మాట్లాడడం మరచిపోయిన కారణంగా నాకు యితరులతో ఎలా పరస్పరంగా కలివిడిగా మాట్లాడాలో నేర్పించారు. ఒకనెల నన్ను నాకు అసూయ వుందని తిట్టేవారు. మరొక నెలలో నాకు అత్యాశ వుందనీ, యిలా ఏదో ఒక మిషతో కోప్పడేవారు. ప్రతీసారీ నేను ఏడుస్తూ మళ్లీ మైసూరు ఆశ్రమానికి తిరిగి రాకూడదనుకుంటూ వెనుదిరిగేదాన్ని. మళ్లీ నేను హస్టల్ కి వెళ్లినప్పుడు ఆశ్రమానికి వెళ్లడానికి కాలెండరులో నాకు అనుకూలమయిన తారీఖులను వెదుక్కునేదాన్ని.

ఆరునెలల గడిచిన తరువాత, నేను నా స్నేహితురాళ్లతో కలవకుండా నాకు మనసులో అప్పాజీ వారు రమ్మన్న పిలుపు వినపడేది. నేను వెంటనే టికెట్ బుక్ చేసుకుని వెళ్లాను. వారి మొదటి ప్రశ్న ‘‘ఎందుకు వచ్చావు?’’ అని వారు చెప్పిన విధంగా వచ్చానని చెప్పడానికి నాకు అహం అడ్డువచ్చి ‘‘ఊరికే’’ అని బదులు చెప్పాను. ఆ రోజు వారు నన్ను చూసినప్పుడల్లా అదే ప్రశ్న పలుమార్లు అడిగారు. అప్పుడు నేను వారిని ‘‘ఎందుకు రాకూడదు?’’ అని అడిగాను. అప్పుడు వారు నన్ను సోమవారం నాడు వుండమని చెప్పి ఆదివారమంతా నాతో మాట్లాడలేదు. నేను నా భోజనం మానేసి ఏడుస్తూ వారి ఫోటో ముందు యిలా ఫిర్యాదు చేశాను. ‘‘అప్పాజీ మీరు మారిపోయారు. నాకు ఈ అప్పాజీ వారు వద్దు మునుపటి అప్పాజీ వారు కావాలి’’. యిదంతా నాకు వారు నన్ను వచ్చినప్పుడల్లా కోప్పడడం వలన వచ్చిన చికాకు.

మరునాడు అప్పాజీ వారు నన్ను పిలిచినప్పుడు నేను వారికి నేను యింక ఆశ్రమానికి రాదలుచుకోలేదని యింతకు మునుపు వచ్చినప్పుడు చాలా ఆనందంగా వుండేది యిప్పుడు నాకు విచారం కలుగుతోంది అని చెప్పాను. అప్పుడు వారు ‘‘గురుశిష్యుల సంబంధం యొక్క మాధుర్యం ఎవరికయితే అనుభవం కలుగుతుందో వారు విడిచివెళ్లలేరు అన్నారు. నేను చాలా దురుసుగా ‘‘అప్పాజీ మీరు నాతో ఆటలాడుతున్నారు. మీకు తెలుసును నేను మిమ్మల్ని విడిచి వెళ్లలేనని అన్నాను. కానీ నాకు భయం కలిగింది. వారు కొద్దిసేపు మౌనంగా వుండి తరువాత చాలా మధురంగా మాట్లాడసాగారు. నేను అంతకు ముందు వారి ఫోటో ముందు మాట్లాడిన విధంగా నా గొంతుకతో నన్ననుకరిస్తూ వారు అప్పాజీ అనే పదానికి బదులుగా సుప్రియ అని జోడించి అవే మాటలు మాట్లాడారు. నేను నా తప్పును తెలుసుకుని వారిని క్షమించమని అభ్యర్ధించాను.

వారికి మనం ఆలోచించే అన్ని విషయాలు తెలుసునని నాకు నమ్మకం కలిగింది. ఒకసారి నాకు ప్రతీనెలా బస్సు టికెట్లు వెతుక్కోవడం చికాకు కలిగించి నాకు కారు వుంటే సులువుగా వుంటుందనే ఆలోచన వచ్చింది. నేను తరువాత మైసూరు వెళ్లినప్పుడు అప్పాజీ వారు నన్ను చూసి ఎలా వున్నావు? అని అడగకుండా ఎలా వచ్చావు అని అడిగారు. నాకు అంత భయం అనిపించకుండా నేను ఎలా వస్తాను. బస్సులోనే కదా అని సమాధానం యిచ్చాను. దానికి వారు లేదు నువ్వు కారులో వచ్చావేమోనని అడిగాను అని అన్నారు. ఒకేసారి వారు నా ఆలోచనలను అలా చెప్పేస్తుంటే సిగ్గనిపించింది. కొన్ని నెలల తరువాత నాకు విషయాలు చాలా అనాయాసంగా కనబడేవి. నా మనస్సు వారు చెప్పిన మాటలను అంగీకరించేది. నా స్వభావం పూర్తిగా మారిపోయింది. నా స్నేహితులు కూడా ఆ మార్పును గుర్తించారు. గురువు యొక్క మార్గదర్శకత్వం మరియు మద్దతు ద్వారానే ఎవరికయినా వారి జీవితంలో మార్పు కలగుతుందని అర్ధమయింది.

ఎమ్.బి.బి.ఎస్ పూర్తయిన అనంతరం నేను లండనులో పి.ఎల్.ఎ.డి. కొరకు వెళ్లాలనుకుని అప్పాజీ వారిని అనుమతి కోరాను. వారు వెంటనే ఒప్పుకుని ఒకే నీకు లండన్ వెళ్లాలని వుందా వెళ్లు అన్నారు. నేను నాకు కావలసిన వస్తువులన్నీ సేకరించుకుని సిద్ధమయ్యాను. కానీ నాకు వెళ్లాలనిపించలేదు. వారిని వదిలి నేను అంత దూరంలో వుండలేనపించింది. వారు నన్ను ఆ విషయమై మళ్లీ అడగలేదు. నేను వెళ్ళడం వారికి యిష్టం లేదని నాకు అనిపించింది. నా లండన్ ప్రయాణం ఆపేసిన నెల అనంతరం నన్ను పి.జి చెయ్యమని చెప్పారు. నేను అందుకు ఒప్పుకున్నాను. తరువాత నెలలో వద్దని చెప్పారు. యిలా ఆరునెలలు గడిచాయి. వారు నన్ను వారు చెప్పిన దానిని అంగీకరించే విధంగా నన్ను సిద్ధం చేశారు. ఆ లోపు యింటర్న్ షిప్ పూర్తయింది. అప్పాజీ వారు నువ్వు పి.జి చేస్తే నా నుంచి దూరం వెళ్లిపోతావు దాని బదులు ఏదయినా ఆసుపత్రిలో పని చేయ్యి అని చెప్పారు.

నేను ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాను. కానీ నాకు అక్కడ రోగులకు వారు చేసే చికిత్సా విధానం నచ్చలేదు. అక్కడ పెద్ద పెద్ద లైన్లలో రోగులు బారులు తీరి నిలబడి చికిత్సకోసం వేచి వుండేవారు. అక్కడ పరీక్షా విధానాలు సరిగా వుండేవి కావు జ్వరం వచ్చిన దాఖలాలు కనబడితే కేవలం ఒక పెరాస్టమాల్ మందును యిచ్చేవారు. అక్కడ వున్నప్పుడు నేను ఒక ప్రముఖ వైద్యురాలి పేరును విన్నాను. ఆ పేరు నాకు సుపరిచితం అనిపించి మా అమ్మగారిని అడిగాను. ఆవిడ మాకు బంధువు అవుతారని తెలుసుకున్నాను. నేను వెంటనే వారి దగ్గర పని చేయాలనుకుంటున్నానని సందేశం పంపాను. దానికి ఆవిడ ఒప్పుకున్నారు. ఆ సమయంలో ఆవిడకు కూడా ఒకరి అవసరం వున్నది నేను ఏ రకమయిన జీతం తీసుకోకుండా ఆరునెలల పాటు అక్కడ పగలూ, రాత్రి పనిచేసి చాలా నేర్చుకున్నాను.

ప్రతి నెలా నేను అయిదు రోజులు సెలవు తీసుకుని నేను మైసూరు ఆశ్రమానికి వెళుతున్నాని చెప్పేదాన్ని. ఆవిడ ఏ విధమైన శ్రద్ధ చూపక నా వైపు విచిత్రంగా చూసి తన వృత్తిలో నిమగ్నమయి వుండేవారు. ఆరునెలల అనంతరం ఆమెకి నేను ప్రసూతి వైద్యంలో పి.హెచ్.డి నిమిత్తం మైసూరు వెళుతున్నానని తెలిపాను. యిది అబద్ధమని మా యిద్దరికి తెలుసు. ఆవిడ చేసే పని చూసి డాక్టర్లకు ఎంత గౌరవం యిస్తారో, నేను అర్ధం చేసుకున్నాను. అందువలన స్వామీజీ వారికి నేను పి.హచ్.డి. చెయ్యడం యిష్టంలేదని గ్రహించాను. పి.హెచ్.డి చేస్తే వారు సమాజంలో బాగా ఉన్నతంగా గౌరవంగా స్థిరపడతారు దీని వలన వారిలో అహంభావం పెరుగుతుంది. అహంకారం కలిగిన వారు శ్రీ అప్పాజీ హృదయానికి దగ్గరవ్వలేరు. యిది ఖచ్చితంగా వారితో నాకు అందిన శిక్షణ.

నేను ఆశ్రమానికి చేరుకున్నప్పుడు స్వామీజీ వారు నాతో ఆ రోజంతా మాట్లాడలేదు. నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదు. దాని వలన నేను ఉదయం, రాత్రి భోజనం మానేశాను. ఆ మరునాడు నాతోటి నీకు అబద్ధం చెప్పి ఆశ్రమానికి రావలసిన అవసరం ఉన్నదా, ఎవరయినా అబద్ధం చెప్పారంటే వారికి ఆ విషయంలో కొంత భయం చేత అలా చేస్తారు. లేక వారు ఏదో తప్పు చేస్తున్నామనే భావనతోనయినా అలా చేస్తారు. నువ్వు భయపడవలసిన పనిలేదు ఎందుచేతనంటే నువ్వు అక్కడ ఉచితంగా పని చేస్తున్నావు. యింకొక విషయం ఒకవేళ నువ్వు ఆశ్రమానికి వస్తున్నందుకు నీకు అనుమతి లభించదేమోనన్న కారణంగా అలా చేసి వుండవచ్చు. నీవు ఆశ్రమానికి వస్తున్నానని చెప్పడం తప్పుగా ఆలోచించకూడదు. ఆ తరువాత ఎవరు నా వంక ఎలా చూసినా సరే నేను ప్రశాంతంగా ఆశ్రమానికి వెళుతున్నానని చెప్పాలి అని నిశ్చయం చేసుకున్నాను. నేను వారు చెప్పాక ఆశ్రమానికి వెళుతున్నామనేది తప్పుకాదని తెలుసుకున్నాను. శ్రీ స్వామీజీ వారు నన్నుతెలుసుకునేలా చేసి నా తప్పును సరిదిద్దారు.

2002వ సంవత్సరంలో అప్పాజీ వారు నన్ను యింకా చిన్నపిల్లలాగా వున్నావని, ప్రపంచాన్ని అర్ధం చేసుకునే సమయం యిదేనని తెలిపారు. ఆ తరువాత నాకు వంటగదిలోకి వెళ్ళే అవకాశం కలగలేదు. మొదటగా నాతోటి మాట్లాడే వాళ్లందరూ నాతో మాట్లాడడం మానేశారు. ఆ తరువాత గమనించిన విషయం నాకర్ధమయిన విషయం వారు నా తోటి కేవలం నేను వంటగదిలోకి వెళుతున్నందువల్లే నాతోటి మాట్లాడేవారు. అది నాకు సమస్యగా అనిపించలేదు. నేను యితరులు నా గురించి అనుకునే మాటలను పట్టించుకోవడం మానేయాలని శ్రీస్వామీజీ వారు నాకు నేర్పారు. దీనితో నేను యిలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. కేవలం మనుషుల పదవులకు మర్యాద నిచ్చేవారితో మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాను.

నాకు అప్పాజీ వారి కార్యక్రమాలలో ఎక్కువ సేపు కూర్చునే అలవాటు లేదు. ఒకసారి వారు నన్ను అలా పూజాకార్యక్రమాలలో ఎక్కువ సేపు కూర్చోనందుకు కోపగించారు. నేను నా మనసులో వారిని మీరే నాకు నా చిన్నతనం నుంచి అన్నీ నేర్పారు కానీ మీరు నాకు ఈ విషయం నేర్పలేదు యిది నా తప్పు కాదు అని కోపంతో వారు నన్ను తిట్టినందుకు ఆరోపించాను. నేను పి.జి కోసం తయారవ్వడానికి మా నాన్నగారి కోరిక నేరవేర్చడానికి హైదరాబాద్ వెళ్లాను. శ్రీ స్వామీజీ వారికి నేను పిజి చేయడం యిష్టంలేదు కనుక నేను ప్రయత్నం చేయలేదు. నేను కూర్చుని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశాను కానీ చేయలేకపోయాను.

మిగతా ఆడపిల్లలందరూ సంతోషంగా వున్నా నేను ఒక్కదాన్నే టెర్రస్ మీదికి వెళ్లేదాన్ని. నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఎవ్వరూ ఆ టెర్రస్ మీద లేరు. బాలికల హాస్టల్ టెర్రస్ కానీ, బాలుర హాస్టల్ టెర్రస్ మీద కానీ ఎవ్వరూ లేరు. నేను చాలా దూరంగా కూర్చున్ని వున్నాను. హఠాత్తుగా నేను శ్రీస్వామీజీ వారు నా ఎదురుగా కూర్చుని వుండడం చూశాను. వారు నన్ను నిటారుగా కూర్చోబెట్టారు. నేను వారి స్పర్శను గ్రహించాను. వారిని గుర్తించగలిగాను. వారు నన్ను కొద్దసేపు కళ్లుమూసుకోమని తెలిపారు. నాకు ఎవరయినా వచ్చిచూస్తారేమోనన్న ఆలోచనలు కలుగసాగాయి. వారు ఎవయినా పుకార్లు లేవదీస్తారని అనిపించింది. వారు సరిగా చెయ్యి, నేను ఆ విషయాలనన్నింటిని చూసుకుంటాను అని చెప్పారు,

కొన్ని నిమిషాల తరువాత వారు ‘‘లే, లే, ఎవరో వస్తున్నారు’’ అని చెప్పారు. నేను కళ్లు తెరిచి చూడగా వారు లేచి నుంచుని అంతర్ధానమయ్యారు. నేను లేచి మెట్ల వైపు నడవడం మొదలుపెట్టాను. నేను ఒక అమ్మాయి మేడ మెట్లను ఎక్కి రావడం గమనించాను. అప్పాజీ వారు నన్ను ఆ అమ్మాయి టెర్రస్ వైపుకు రావాలనుకున్నప్పుడు నన్ను హెచ్చరించారని నాకు అర్ధమయింది. అప్పటినుండి నేను కొన్ని గంటలపాటు వారు పూజ చేస్తున్న సమయంలో కూర్చోగలిగాను. చాలా గంటలపాటు నేను పద్మాసనంలో కూర్చోగలిగే దాన్ని. చాలా సంవత్సరాల తరువాత వారు నాకు ఆసనసిద్ధి కలిగిందని తెలిపారు.

ఎనిమిది నెలలు హైదరాబాదులో వుండి, నేను నా మనసులో నాకు నెలకు మూడు వందల రూపాయలు నా ఖర్చులకు సరిపోతాయని అనుకున్నాను. నేను మా నాన్నగారితో నా దగ్గర వున్న డబ్బులు సరిపోతాయని మిగిలిన డబ్బులతో శ్రీ స్వామీజీ వారిని ప్రతినెలా దర్శించుకోవడానికి సరిపోతాయని తెలిపాను. నాకు డబ్బుల విలువ తెలిసింది. కొన్ని నెలల తరువాత మా నాన్నగారు నాకు అప్పాజీ వారిని పిఠాపురంలో కలిశానని చెప్పారు. వారు నన్ను శ్రీకాకుళం వచ్చి వారిని కలవమన్నారని చెప్పారు.

యిన్ని నెలలు కొంతమొత్తం డబ్బులతోనే గడిపినందున, నాకు విసుగు వచ్చి శ్రీ స్వామీజీ వారి ఫోటో ముందు వారికి నేను పడే కష్టాలు తెలియడంలేదని అరవసాగాను. నేను శ్రీకాకుళం వెళ్లాను. అప్పాజీవారు నన్ను చూసి నన్ను ఉపన్యాస సమయంలో తిట్టడం మొదలుపెట్టారు. నీకెంత ధైర్యం, నీ కష్టాలను గురించి నాకు తెలియదనడానికి, నేనూ అలాగే పెరిగాను. నువ్వు తెలుసుకోవాలని నిన్ను కూడా అలానే పెంచుతున్నాను. వేరే వాళ్లని తప్పులు తెలిపి మార్చడానికి ప్రయత్నించవద్దు. చెడు లక్షణాలకు ఆకర్షించే గుణం వుండి నువ్వు కూడా చెడ్డగా మారిపోతావు (ఆ నెలలో నేను ఒకరికి మంచి చెప్పి మార్చడానికి ప్రయత్నంచేసాను). అప్పాజీ వారికి వాళ్లని మార్చాలనిపిస్తే, వాళ్లే మారతారు ఎవరినీ ఆక్షేపించవద్దు. నిన్ను ఏదైనా వివాహానికి పిలిస్తే వెళ్లు, కానీ నీవు నోరు జారవద్దు. వాళ్లు నీ మాటలు వింటే వాళ్లకు ఎంత బాధగా వుంటుంది. వాళ్లమ్మాయి పెళ్లకి వాళ్లు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. (నేను ఆ నెలలో మా బంధువుల యింటికి వెళ్లాను. నాకు అక్కడ ఏర్పాట్లు నచ్చక నేను మా దగ్గర బంధువు దగ్గర వారిని ఆక్షేపించాను).

ఆ తరువాత శ్రీ స్వామీజీ వారి ప్రొద్దటూరు పర్యటన ఖరారయింది. మా నాన్నగారు నన్ను అక్కడ ఉండమన్నారు. వారు గురునిలయంలో కొన్ని మరమ్మత్తులు చేయిస్తున్నారు. శ్రీ స్వామీజీ వారు అక్కడ పనులు చూసి సంతోషించారు. ఆయన ఆ పనులను ఎవరు చూసుకున్నారు అని అడిగితే దానికి నేనే అని సమాధానమిచ్చాను. వారు నన్ను అంతటా తీసుకుని వెళ్లి ఎక్కడెక్కడ మరమ్మత్తులు చెయ్యాలో తెలిపారు. నేను సరే అప్పాజీ నేను చేస్తాను అని చెప్పాను. నా ప్రవేశ పరీక్షల అనంతరం నేను ప్రొద్దటూరు తిరిగి వచ్చాను.

2003లో నేను సంపాదించిన డబ్బులను మరమ్మత్తులకు ఉపయోగించాను. మా నాన్నగారికి నేను అలా చేయకుండా వుంటే బాగుండేదనిపించింది. అక్కడ వేరే కమిటీ సభ్యులున్నారు. వారు ఆ బాధ్యతను తీసుకొనవలసి వున్నది. కానీ , నేను శ్రీస్వామీజీ వారు నన్ను అడిగినందున ఆ పని చేస్తానని అన్నాను. మా నాన్నగారికి అసలు యిష్టంలేదు. కానీ నేను ఆయన మాటలను వినలేదు. నేను ఆశ్రమానికి వెళ్లి అక్కడ మేనేజరును, కాంట్రాక్టరును తీసుకు రమ్మని కోరాను. కొన్ని నెలల అనంతరం ఒక భక్తుడు పదిహేను వేల రూపాయాలను ఒక వ్యక్తి దగ్గరనుండి విరాళంగా తీసుకుని వచ్చాడు. ఆ వ్యక్తికి గుండెపోటు రాగా అతను శ్రీ స్వామీజీ వారిని ప్రార్థించినందున అది నయమయింది. ఈ సొమ్ము చాలా ఉపయోగపడింది, దానికి కారణం నా దగ్గర డబ్బులు అయిపోవచ్చాయి.

డబ్బులు అన్నీ అయిపోయాయి. యింకా కొన్ని పనులు ఉండిపోయాయి. నేను ఆశ్రమానికి వచ్చాను. కానీ అప్పజీ వారికి ఈ విషయం చెప్పలేదు. వారు నిర్మాణ పనులను గురించి అడిగి నన్ను పనులు పూర్తికానందున మందలించారు. నాకు కోపం వచ్చి నేను నా దగ్గర డబ్బులు లేవని తెలిపాను. వారు నాకు యాభైవేల రూపాయలను యిచ్చారు. అవి సరిగ్గా సరిపోయాయి. ఆ మరమ్మత్తులు అయిన తరువాత శ్రీ స్వామీజీ వారు నన్ను ఆ పనులలో కల్పించుకోవద్దనీ ట్రస్టీలు ఆ బాధ్యతలను చూసుకోవాలని తెలిపారు. వారు నాకు ఆ విషయాన్ని యింతటితో వదిలేసి ఆలోచించవద్దని తెలిపారు.

2004లో ప్రొద్దటూరులో ఏమీ లేకపోవడం చేత, నేను మైసూరు ఆశ్రమంలో చాలా రోజులు వుండిపోయాను. నాకు ఏమీ తోచడంలేదు. అక్కడ ఏ కార్యక్రమాలు లేవు. నేను వంటగదిలోకి కూడా వెళ్లడంలేదు. ఒకరోజున శ్రీస్వామీజీ వారు నన్ను పిలిచి నన్ను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నానో అడిగారు. పోస్ట్ గ్రాడ్యుయేషనా లేక ఉద్యోగంలో చేరతావా? అని అడిగారు. నేను నాకు యింక చదవాలని లేదనీ, ఎమ్.బి.బి.ఎస్ డిగ్రీతో పని చేయాలని కూడా లేదని తెలిపాను. వారు నన్ను నేను ఏది చెయ్యమంటే అది చేస్తావా అని అడిగారు. నేను మీరు ఏమి చెప్పినా చేస్తాను అప్పాజీ అని చెప్పాను. దానికి వారు నాకు రెండు రోజుల గడువు యివ్వు ఏం చెయ్యాలో చెబుతాను అన్నారు. రెండు రోజుల అనంతర వారు నన్ను మళ్లీ పిలిచి నువ్వు నా నుండి దూరంగా కొంతకాలం వెళ్లిపో అని అన్నారు. నేను గట్టిగా ఏమిటీ, అని అరిచాను. నా చిన్నప్పటినుండి నేను వారి నుండి వెళ్లిపోవాలని అనుకోలేదు. అప్పుడు వారు నాతో నాకు నువ్వు నా మాట వినవని భయంగా వుంది, అందువలన నా పాదాల మీద ప్రమాణం చెయ్యి అన్నారు. అప్పుడు నేను కాదు, కాదు నేను ఏం చేయాలో మొట్ట మొదట నాకు చెప్పండి అని అడిగాను. మేము ఆ విషయమై వాదులాడాము. చివరకి నేను వచ్చి వారికి వారి మాట వింటానని ప్రమాణం చేశాను. అప్పుడు వారు నువ్వురష్యాకు వెళ్లాలి. నాకు నువ్వు విదేశాలకు వెళ్లాలని ప్రణాళికలున్నాయి, రష్యా, ఆస్ట్రేలియా లేక ట్రినిడాడ్. కానీ నేను రష్యాను ఎన్నుకున్నాను అని చెప్పారు. నేను ఎందుకు అని అడిగాను. వారు నన్ను కార్యసిద్ధి ఆంజనేయస్వామికి పూర్ణఫలం కట్టమని పంపారు. నేను నా చిన్నప్పటినుండి ఏమీ కోరలేదు. అందువలన నేను ఏం కోరుకుని కట్టాలి? అని అడిగాను. దానికి అప్పాజీ వారు హనుమంతుడు ఏమి అనుగ్రహిస్తే అది జరగాలని కోరుకో అన్నారు. రెండు రోజుల తరువాత అప్పాజీ వారు నన్ను నవ్వు వెళ్లడానికి సిద్ధంగా వున్నావా అని అడిగారు.

ఆ మరుసటి ఆదివారం, ప్రేయర్ హాల్లో శ్రీ స్వామీజీ వారు చాలామంది భక్తులను వచ్చి ఒక్క ఆంగ్లపదం కూడా ఉపయోగించకుండా వారి భాషలో మాట్లాడమనీ అడిగారు. చాలా మంది మాట్లాడారు. ఆ తరువాత వారు నాతో ఏ భాష అయినా శ్రద్ధగా వింటే అర్ధం కాకుండా వుండదు అని చెప్పారు. నేను యుక్రెయిన్ వెళ్లిన తరువాత, కొన్ని నెలలలోనే రష్యన్ విధానంలో పనిచేయగలిగాను. నాతో వారు నువ్వు యితర భాషా సంప్రదాయాలు వున్న దేశంలో ఎలా నివసించాలో నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. కష్టపడి నేర్చుకో, కానీ మీ అప్పాజీ వారు నీతోనే ఎల్లప్పుడు వుంటారన్న విషయం మాత్రం మరచిపోవద్దు.

ఆ మరునాడే మా నాన్నగారు ఆశ్రమానికి వచ్చారు, శ్రీ స్వామీజీ వారు ఆయన్ని పిలిచి ఆమెని మీరు పంపుతారా, లేక నేను పంపనా? అని అడిగారు. అప్పుడు మా నాన్నగారు తాను పంపుతానని తెలిపారు. శ్రీ స్వామీజీ వారు ఒక మధ్యవర్తిని వీసా మరియు యితర ఏర్పాట్లకై చూడవలసిందిగా సలహా యిచ్చారు. మా నాన్నగారు అందుకు ఒప్పుకున్నారు. ఏదేమయినా మా అక్క, మా తమ్ముడు, నేను విదేశాలకు వెళ్లాలని అనుకోలేదు. మా నాన్నగారు అప్లికేషన్ ఫారంతో పాటుగా ప్రాస్పెక్టస్ ను నాకు యిస్తూ అప్పాజీ వారు పంపారని తెలిపారు.

ఆ మరునాడు మా నాన్నగారు ఆశ్రమం యొక్క ప్రజాసంబంధాల అధికారి అవడంతో వారు ఢిల్లీలోని ఒక వ్యక్తిని గుర్తుకు తెచ్చుకున్నారు. వారిని మా నాన్నగారు కొద్ది నెలల క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసారు. వారికి ఒక ఆఫీసు వుందని, ఆ ఆఫీసు నుండి యువకులను యితర దేశాలకు చదువు నిమిత్తం పంపిస్తారని ఎవరి ద్వారానో తెలియడం చేత మా నాన్నగారు వారితో ఫోన్లో మాట్లాడారు ఆయన ఉక్రెయిన్ లోని ఒడెస్సా యూనివర్సిటీ గురించి తెలిపారు. నా దగ్గర అవే వివరాలు వున్నాయి. నేను అంగీకరించిన అనంతరం కొన్ని నెలల అనంతరం ఒకరోజు శ్రీ అప్పాజీ వారు నన్ను పిలిచి అక్కడ వున్న నిబంధనలన్నీ అంగీకరించాలని హెచ్చరించారు. వారు ఈ విషయంలో తరువాత ఎటువంటి నిరుత్సాహానికి గురికాకుండా వుండేందుకు నన్ను సిద్ధం చేశారు. అదృష్టవశాత్తు వారు అలా చేశారు, అక్కడి హాస్టళ్లు వంద సంవత్సరాల నాటి పాత బంగళాలు చాలా భయంకరమయిన ఆకారాలు కలిగి వున్నాయి. భారతదేశం నుండి వచ్చిన విద్యార్ధులందరిలో నేనొక్కర్తినే వారి నియమ నిబంధనలను అంగీకరించాను. నాతో పాటు వచ్చిన మిగతా వారంతా అక్కడి పరిస్థితి చూసి కలతచెంది వాళ్లు అక్కడ వుండలేమనీ, తిరిగి వెళ్లిపోవడానికి టికెట్లను బుక్ చేయమని కోరారు. కొన్ని రోజుల తరువాత నేను ఈ హాస్టలును యిదివరకే నా కలలలో చూశానని గ్రహించాను.

ఏదేమయినా, ప్రతి ఒక్కరు వున్నారు, కానీ అక్కడి పి.జి. ఆ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీసరు భారతదేశంలో వున్న కారణాన మిగతా సిబ్బంది మమ్మల్ని అంగీకరించలేదు. పదిరోజుల పాటు, మేము ప్రతిరోజూ అక్కడి అండర్ గ్రాడ్యుయేటు డీన్ యొక్క ఆఫీసు ముందు నిలబడి వుండేవాళ్లము ఆ తరువాత మమ్మల్ని డైరెక్టర్ ఆఫీసు ముందు నిలబడమని చెప్పారు. మేము అలాగే నిలబడ్డాము. అక్కడ చేరుకున్న అనంతరం నేను అక్కడి రెండు ద్వారాలను యిదివరకే నా కలలో చూశాను. అవి తెల్లని పెద్ద ద్వారాలు, వాటి కుడివైపున నేను చిన్న దీపం వెలుగులో ఒక పేపరు పని చేయసాగాను. యిది పోస్ట్ గ్రాడ్యుయేట్ డీన్ ఆఫీసుగా మారింది, యిక్కడే నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేటు వచ్చింది.

నాకు అక్కడి తొమ్మిది అంతస్తుల భవనంలో ఆరవ అంతస్తులో వసతి దొరికింది. అక్కడి కారిడార్లలో పూర్తిగా చీకటి వుండడంతో నాకు భయం వేసేది. ఒక్కోసారి నేను హనుమంతుడు నా కిటికీలో కూర్చుని, బయటకు చూస్తూ నన్ను రక్షిస్తుండడం చూశాను. కొన్ని సార్లు రాత్రి సమయంలో కబోర్డు దగ్గర, తలుపు దగ్గర నేను శ్రీ స్వామీజీ వారిని చూశాను. అప్పుడు నాకు సౌకర్యవంతంగా అనిపించి నేను పక్కకు తిరిగి పడుకునే దాన్ని. నాతో పాటు గదిలో ప్రియాంక కూడా స్వామీజీ వారిని కొన్నిసార్లు చూసి నాకు చెప్పింది. ఆమెకు వారి వునికి భయమనిపించలేదనీ, వారిని చూసిన అనంతరం తను కూడా విశ్రాంతి పొంది హాయిగా నిద్రపోయేదాన్నని తెలిపింది. ఒకరోజు నేను వారిని ‘‘దయచేసి మేము మిమ్మల్ని మళ్లీ చూడకూడదు, యింకొక అమ్మాయికి దయ్యాలు అంటే భయం మరియు బాగా ఆందోళన చెందుతుంది’’ అని ప్రార్ధించాను. ఆ రోజు నుండి మేము ఎవ్వరమూ వారిని చూడలేదు.

నేను ఒడెస్సాలో వున్న రెండు సంవత్సరాలు నాకు చాలా బాగుంది , కానీ అక్కడ అనుక్షణం ప్రతి విషయానికి కష్టపడవలసి వచ్చేది. కానీ నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. కష్టపడిన అనంతరం నేను నా పనులను చాలా సులువుగా పూర్తిచేయగలిగే దాన్ని. అలాగ అప్పాజీ వారు నన్ను నేర్చుకునేలా చేసారు. నేను నేర్చుకుని ఆ కోర్సులో ఉత్తీర్ణత పొందాను. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, నా సర్టిఫికేటును భారతప్రభుత్వం అంగీకరించలేదు, దాని చేత నేను దూరంగా వెళ్లినందుకు కొంత బాధ పడ్డాను. యిదంతా స్వామీజీ వారు చేసిన ప్రణాళిక. నాకు వారి మీద కొన్ని ప్రతికూల భావనలు వుండేవి. కాని అవి తొలగిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నా జీవితంలో కలిగిన ప్రతి కదలికా వారి చిత్రీకరించినదే, వారు నాకు వాటి వివరణ కూడా యిచ్చారు. నేను అలా ఆలోచించినందుకు చింతిస్తూ నేను వాటిని అంగీకరిస్తున్నాను. ఒడెస్సాలో చదవాలన్నది మా నాన్నగారి ఆలోచన, నేను మా నాన్నగారి మాటలను వినననీ ఆయన శ్రీ స్వామీజీ వారిని నన్ను అందుకు అంగీకరించేలా చేయమని, కోరుకున్నారని నాకు తరువాత తెలిసింది. ఎవరి ప్రణాళిక అయినా కానీ, అప్పాజీ వారు ఒప్పుకున్నప్పుడు అది అంతా నా మంచికోసమే.

వారు ఎప్పుడూ చెబుతారు యీ నిజమైన అద్భుతం వ్యక్తిలో మార్పు స్వయంగా తీసుకురావడమే. మనం శ్రీ అప్పాజీ వారి దగ్గరకు వచ్చిన అనంతరం మన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును మనం తెలుసుకోగలగాలి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నా గురువు. వారు నన్ను అధ్యాత్మికంగా మార్గదర్శకత్వాన్ని యిస్తారు. వారు నన్ను అర్ధం చేసుకుంటారు. వారికి నా పరిస్థితి తెలుసును. వారు నాకు ప్రయోజనం కలిగే విధంగా నేర్పిస్తారు. వారు నా తండ్రి, తల్లి. నేను మా తల్లిదండ్రులకు కూడా చెప్పని కొన్ని విషయాలను వారికి తెలుపుతాను. వారు నన్ను అర్ధం చేసుకుని నాకు అర్ధమయ్యే విధంగా తగిన సలహాలను యిస్తారు.

జయ గురు దత్త

Tags: