SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
మాధురి తివారీ, వదోదర (Madhuri Tiwarie, Vadodara)

నేను 1990వ సంవత్సరంలో ఒక పాఠశాలలో టీచరుగా శ్రీమతి రమాదేవిగారు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ప్రగాఢ భక్తురాలితో పాటుగా పనిచేసే దానిని. ఖాళీ సమయంలో ఆవిడ తన గురువుగారి గురించి చెప్పేవారు. నేను ఆవిడ చెబుతున్న వాటిని ఎదురు ప్రశ్నలు వేయకుండా వినేదాన్ని. ఆ మాటలకు ఆకర్షితురాలనయి నేను ఈ చర్చలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని మన సహోద్యోగులందరిని ఆవిడ యింటికి కానీ మా యింటికి గాని ఆహ్వానించి వారికి శ్రీస్వామీజీ వారిని గురించి చెబుదామని కోరాను.

దీనికి ముందర నేను శ్రీస్వామీజీ వారిని గురించి వినడం గానీ, వారిని చూడడం గాని జరగలేదు. కానీ వారి జీవన విధానం యితరులకుంటే భిన్నంగా అనిపించింది. నాకు వారిని గురించి యింకా తెలుసుకోవాలని ఉంది. రమాదేవి గారు నా అభ్యర్ధనకు చాలా సంతోషించి, కొద్దిమందిని వారి యింటికి ఆహ్వానించారు. కేవలం ఆరుగురు మాత్రమే వారింటికి వచ్చారు. ఆమె స్వామీజీ వారి శక్తిని, వారి కరుణను మాకు తెలిపారు. ఆమె వారి క్యాసెట్లను చూపించి, వారు సంగీతం ద్వారా అనారోగ్యాలను నయం చేస్తారని తెలిపారు. ఆవిడ మనం శ్రద్ధతో వారి సంగీతాన్ని వింటే మన శరీరంలోని ఎటువంటి వ్యాధి అయినా నయం అవుతుందని తెలిపారు.

ఈ విషయాలను విన్న తరువాత నాకు వారిపై శ్రద్ధ కలిగింది. మేము తరచు వారి గురించి మాట్లాడుకోవడానికి కలిసేవాళ్లము. ప్రతి ఆదివారం మాకు ఒక అలవాటుగా అయి, యోగాభ్యాసం, రమాదేవిగారితో చర్చలు జరిపేవాళ్లం. యిలా కలుసుకున్న సమయంలోనూ, ఆ తరువాత కూడా మాకు అనారోగ్యాల నుండి రిలీఫ్ అనుభవమయ్యేది. ఆ సమయంలో నా కాళ్లు దాదాపు పక్షవాతం వచ్చినట్లుండేది నేను నడవలేక పోయేదానిని. అయినా సరే నేను అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చుని ఆ కార్యక్రమంలో పాల్గొనేదానిని. రమాదేవిగారు నాకు ఇన్నర్ హీలింగ్ క్యాసెట్టు యిచ్చారు. నేను మందులు వేసుకుంటూ ఆ క్యాసెట్ వినేదాన్ని. నెమ్మదిగా నేను నా కాళ్లను కదపగలిగి ఆ తరువాత నడవడం మొదలు పెట్టాను. నేను ఈ విధమైన అనుభవం శ్రీ స్వామీజీ వారి దయగా భావించాను. నేను శ్రీ స్వామీజీ వారిని అప్పటికి యింకా దర్శించలేదు.

నాకు శ్రీ స్వామీజీ వారి ఒక సంగీత కచేరి చేయడానికి వదోదరా రావాలనుకుంటున్నారని తెలిసింది. ఆ రోజులలో మేము చాలా కొద్దిమందిమి మాత్రమే అవడంతో మా దగ్గర డబ్బులు కూడా చాలా తక్కువగా వున్నాయి. ఆ కచేరికి అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి. అందువలన మేము అందరినీ అడిగి డబ్బులు విరాళాలుగా సేకరించాలని అనుకున్నాము. వారు నాకు నా కాళ్లను తిరిగి పనిచేసేలా చేసినందున, వారికి ప్రత్యుపకృతిగా ఏదైనా చేయాలని నేను అనుకున్నాను. ప్రతిరోజు బడి ముగిసిన అనంతరం నేను యింటి యింటికి వెళ్ళి ఈ కార్యక్రమం కోసం డబ్బులు అడిగేదాన్ని. చాలా ప్రదేశాలలో ప్రజలు యిచ్చేవారు. చివరికి నేను 17000 రూపాయలు సేకరించగలిగాను. నేను వెళ్లిన కొన్ని యిళ్లవాళ్ళు నన్ను తరిమి కొట్టేవారు. కొంతమంది నా మొహాన ఉమ్మి వేసేవారు. కానీ, నా మనసులో మాత్రం ఈ పని చేయాలని సంకల్పం శ్రీ స్వామీజీ వారిని చూడాలనే కోరిక బాగా వుండేది.

ఆ సమయం వచ్చినప్పుడు శ్రీ స్వామీజీ వారు సిటీకి వచ్చారు. నేను వారిని చూడడానికి వెళ్లాను. చాలామంది భక్తులు అక్కడ వుండడంతో నేను వెనకాల ఒక మూల నిలుచుండిపోయాను. అప్పుడు వారు నా వంక చూసి నవ్వారు. ఆ నిమిషంలో నా శరీరమంతా విద్యుత్ ప్రసరించినట్లయింది. నాకు ఏమి జరుగుతున్నదో అర్ధం కాలేదు. నేను వారు పెదవులు కదపడం గమనించాను. కానీ, వారు చెబుతున్నది నాకు వినపడలేదు. కానీ నేను వారు మాధురీ, మాధురీ అని పిలుస్తున్నారని గ్రహించాను. అప్పుడు రమాదేవి నా చేతులను పట్టుకుని నన్ను శ్రీ స్వామీజీ వారి దగ్గరకు తీసుకుని వెళ్లారు. నేను వారి ఎదురుగా వెళ్లి నిలుచున్నాను. వారు నన్ను ఆశీర్వదిస్తున్నారని తెలిసి మిన్నకుండిపోయాను,

రమాదేవి శ్రీ స్వామీజీ వారు నాకు ఏదో యివ్వాలనుకుంటున్నారని తెలిపారు. కానీ నేను నా చేతులను ముందుకు చాపలేకపోయాను. అప్పుడు ఆవిడ నా చెయ్యిని పైకి ఎత్తారు. స్వామీజీ వారు నా చేతిలో రుద్రాక్ష మాలను వుంచారు. నా శరీరం కంపించసాగింది. నేను విపరీతంగా రోదించసాగాను. నేను విరాళాలు సేకరిస్తున్నంతసేపు వారు నాతోనే వున్నారని విన్నాను. నేను ఎన్నడూ ఒక మాట కూడా మాట్లాడలేదు. వారి పవిత్ర పాదాలను తాకలేకపోయాను. నేను నిర్ఘాంతపోయాను. నేను వారి చేతిలో మాలను చూడలేదు కానీ ఒక మాజిక్ లాగా నా చేతికి యిచ్చారు. ఆ మాల యిప్పటికీ నా పూజగదిలో వున్నది. అప్పుడు వారు అందరితో యిలా అన్నారు. ఈవిడను చూడండి, ఈవిడే నన్ను యిక్కడికి తీసుకువచ్చారు. అప్పటి నుండి నేను ఒక నోటుపుస్తకంలో శ్రీ దత్త నామాన్ని తప్పక వ్రాయడం మొదలు పెట్టాను.

ఒక రోజున రమాదేవి నన్ను తనతోపాటు శ్రీ స్వామీజీ వారిని దర్శించుకోవడానికి మైసూరుకు రావలసిందని కోరారు. నేను నాకు ఆరోగ్యం సహకరిస్తే తప్పక వస్తానని తెలిపాను. మా అమ్మాయి స్వాతి నన్ను తీసుకుని వెళతానని తెలిపింది. నేను మైసూరులో అందరూ కూర్చునే చోట కూర్చున్నాను. శ్రీ స్వామీజీ వారు నన్ను చూసి పేరు పెట్టి పిలిచారు. ఆ తరువత నాకు వారితో కొన్ని జన్మలనుండి విడదీయరాని అనుబంధం వున్నదని గ్రహించాను. నేను వారికి చెందిన దానిని వారు నాకు చెందిన వారని గ్రహించగలిగాను.

ఒకసారి నా మనవడికి చంఢీగడ్లో ఆక్సిడెంటు జరిగింది. కానీ అక్కడ వారికి ఎవ్వరికీ ఆ రోజున ఏం జరిగిందో తెలియదు. స్వాతికి ఫోన్ ద్వారా తన కుమారుడికి ఆక్సిడెంటు జరిగిందని వచ్చి తీసుకుని వెళ్లమని సందేశం అందింది. ఆమె అక్కడికి వెళ్ళి, చూడగా తన కొడుకును వదోదరకు తీసుకుని వెళ్ళడం అసంభవమనిపించింది. ప్రమాదవశాత్తు అతను డాబామీద నుండి కింద పడ్డాడు. ఎవరూ ఆ ప్రమాదాన్ని గమనించలేదు. మూడుసంవత్సరాల తరువాత అతను కోలుకుని అవకాశం దొరికినప్పుడల్లా అతను శ్రీ స్వామీజీ వారి వద్దకు వెళుతూంటాడు. యిది ఆ మహనీయుని యొక్క అపార కృప.

నేను మైసూరుకు కేవలం ఒకసారి మాత్రమే వెళ్లాను. నాకు అక్కడికి మళ్లీ వెళ్లవలసిన అవసరం లేదు. నేను వారి సందేశాలను, ఉపదేశాలను అనుసరించి వారికి సేవ చేయడమే వారికి కావలసినది. నేను అక్కడికి వెళ్లి వారిని యిబ్బంది ఎందుకు పెట్టాలి? నేను నా పూజలను చేస్తూ, నా జపనామాన్ని వ్రాస్తూ వారినే తలచుకుంటాను. నాకు వారి దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేదు. వారు నన్ను కలిసారు. నన్ను వారు ఎరుగుదురు. నాకు వారి మీద పూర్తి నమ్మకం వుంది. నాకు కష్టాలు వున్నా లేకపోయినా నేను వారిని ప్రార్ధిస్తాను. పరుగెత్తుకుంటూ వెళ్లి వారి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయనక్కరలేదు. వారు ప్రతిచోటా వున్నారు. వారు నాతోపాటు యిప్పుడు కూర్చుని వున్నారు.

జయ గురు దత్త

Tags: