చాలా మంది తమ గురువును కలవకనే తమ జీవితాన్ని గడిపేస్తారు. గురవు యొక్క ప్రభావాన్ని కనీసం ఒకసారయినా దర్శించే సామర్ధ్యంలేని వారు చాలా మంది ఈ భూమిపై ఉన్నారు. నేను 1992 సంవత్సరానికి ముందు వరకు ఆ కోవకు చెందిన వాడినే. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సు నుండి నా గురువు కోసం అన్వేషణ సాగిస్తున్నాను. నేను కలిసిన ప్రతి సారి ఈ వ్యక్తి లేదా ఆ గురువు మీ గురువు కాదని తెలిపేవారు. అందువలన నేను నా అన్వేషణని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని కలిసేవరకు కొనసాగించాను. యిప్పుడు నేను నా గురువును కనుగొన్నాను.
అప్పటి వరకు నేను, ఖర్వాసా వద్ద, దిండోలి గ్రామంలోని తేజానందబాబా గుడికి వెళ్లేవాడిని. ఒకసారి నేను ఆ ఆలయం నుండి తిరిగివెళుతున్న సమయంలో ఒక వ్యక్తి నన్ను ఆపి ఈ గుడికి వస్తున్నందుకు నన్ను అభ్యంతర పెట్టకపోయినా, నా నిజమైన స్థలము సూరత్లోని దత్త ఆలయ ప్రాంతమని నాకు తెలిపారు. ఆయన నన్ను ఆ దత్త ఆలయాన్ని సందర్శించమని, అక్కడ నన్ను భజనలను ఆలపించమని సంతూర్ వాద్య పరికరాన్ని వాయించవలసిందిగా కోరారు. నేను ఆ తరువాత ఆదివారము నాడు, అక్కడకి చేరుకుని శ్రీ బల్లూ గారిని సంప్రదించాను. అప్పటి నుండి నేను ఈ దత్త ఆలయానికి వస్తూనే వున్నాను.
ఆ తరువాతి 1993 సంవత్సరంలో శ్రీ స్వామీజీ వారిని నేను మొట్టమొదటిసారి వారు మైసూరు నుండి నేరుగా మద్గల్ల విమానాశ్రయం నుండి విచ్చేసి యిక్కడ రెండు రోజులు వున్న సందర్భంలో దర్శించుకున్నాను. నేను కేవలం వారిని చూడడమే కానీ వారితో ఏ విధమయిన సంభాషణను చేయలేదు. కేవలము కనుల ద్వారా మా సంపర్కము జరిగింది. వారి అనుగ్రహ భాషణ అనంతరం, మూలికను, పసుపు కొమ్మును గురించి వివరిస్తూ యిది ఆరోగ్యంపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందనీ ఈ మూలిక కాన్సర్ వంటి రోగాలను నయం చేస్తుందని తెలిపారు. ఈ మూలిక చేకూర్చే స్వస్థత లక్షణాలను గురించి వివరించి, మాకు ప్రసాదంగా యిచ్చారు. మేము ఆ మూలిక యొక్క శక్తిని మేము గ్రహించలేక పోయాము. దానిని మా పూజగదిలో భద్రపరచి వుంచాము.
ఆ తరువాత 1994లో మా బంధువు ఒకతనికి కాన్సర్ వ్యాధి నిర్ధారింపబడటం చేత బొంబాయిలోని జస్లోక్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు అతని కుటుంబ సభ్యులతో యిది వైద్యం వల్ల నయం కాని వ్యాధి అని, అతను ఎక్కువ కాలం జీవించడని తెలిపారు. వైద్యులు అనవసరంగా ధనం వృధా చేయవద్దని అతనిని సూరత్లోని వారి యింటికి వెనక్కి తీసుకుని వెళ్లిపొమ్మని సలహా యిచ్చారు. వారు బాధాతప్త హృదయులయి అతనిని సూరత్ లోని మహావీర్ హాస్పటల్ లోని మరొక వైద్యనిపుణులకు చూపించగా వాళ్లు కూడా యిదే విషయం తెలిపారు.
ఆ సమయంలో అతనికి క్యాన్సర్ వ్యాధి చివరి దశలో ఉన్నది. నేను మా అమ్మగారికి శ్రీ స్వామీజీ వారు యిచ్చిన మూలికను ప్రయత్నం చేయమని తెలిపాను. అతని మనుగడకు చాలా తక్కువ సమయం వున్నందున ప్రయత్నం చేస్తే జరిగే ప్రమాదం ఏమీ లేదనీ నేను భావించాను. నేను ఆ మూలిక వాడి చూద్దామని ఒత్తిడి చేశాను. మా అమ్మగారు ఆ మూలికను తీసుకుని నీళ్లల్లో కలిపి అతనికి యిచ్చారు. మీరు నమ్మరు అతను కాన్సర్ వ్యాధినుండి కోలుకుని యిప్పటికీ జీవించి వున్నాడు. వైద్యులందరూ. వారి కుటుంబ గురువు, అతను చనిపోతాడని అంచనా వేసిన జ్యోతిష్యులు అందరూ ఆశ్చర్యపోయారు. అది అద్భుతమయిన విచిత్రం. అతను కోలుకున్న అనంతరం అతని వ్యాపారము అభివృద్ధి చెందింది. అతని కుమార్తెకు వివాహం జరిగింది. అతను ధనవంతుడయి వున్నతంగా జీవిస్తున్నాడు. అతనికి వంద శాతం నయమయి యిప్పటికీ జీవించి వున్నాడు.
శ్రీ స్వామీజీ ధనవంతులైన భక్తులను మాత్రమే సందర్శిస్తున్నారని, డబ్బుపై మొగ్గు చూపుతున్నారని ప్రజలు అనుకుంటారు కానీ, నాకు అలా అనిపించదు. వారు నిజమయిన భావనతోను, నిజాయితీతోనూ ప్రజలను చూస్తున్నారు. సూరత్ ఆశ్రమంలో వున్న ట్రస్టీలు కొంతవరకు ధనవంతులే. కానీ నేను చాలా సామాన్య వ్యక్తిని, శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులతో నేను నా జీవితంలో ఎంతో లబ్ధిని పొందాను. నేను చాలా సంతోషంగా, సౌకర్యవంతమయిన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పలేను, కానీ వారు నేను సఫలంగా మరియు సమర్ధవంతంగా వారి పనిని చేయగలిగినంతగా నాకు తగినంతగా యిచ్చారని చెప్పగలను.
1995లో శ్రీ స్వామీజీ సూరత్ సందర్శించినప్పుడు ఆశ్రమంలో హాలుని నిర్మించాలని మేము ప్రణాళిక చేశాము. వారు నిర్మాణానికై విరాళాలు సేకరించవలసినదని తెలిపారు. 1997వ సంవత్సరంలో వారు సూరత్ వచ్చినప్పుడు నన్ను సమావేశానికి హాజరు కమ్మని ఆదేశించారు. ఆ సమావేశంలో నన్ను కూడా ధర్మకర్తగా నియమించారు. నేను ఆ సమయంలో చాలా సాధారణమయిన వ్యక్తిని. ఈ సన్నివేశం నా ఆత్మను ఉత్తేజపరచింది. నా నియామక వార్త నాకు సంఘంలో ఎంతో ఉత్సాహాన్ని మరియు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. నా వ్యాపారం అభివృద్ధి చెంది, నా ఆదాయం పెరిగింది. ప్రస్తుతం నేను సౌకర్యవంతంగా జీవిస్తున్నాను.
1995-1996లో నేను చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కుంటున్న సమయం. 1997లో నేను అశ్రమానికి వెళ్లినప్పుడు స్వామీజీ వారు నాకు నా భాగ్యం మారి మంచిరోజులు వస్తాయని తెలిపారు. వారు నాకు కలలలో కనిపించి నాకు మార్గనిర్దేశం చేసేవారు. మా యింట్లోని వారి పేర్లన్నీ వారికి తెలుసు, యిది మాకు చాలా పెద్ద గొప్ప విషయం. వారికి చాలా మంది భక్తులు వున్నప్పటికీ వారికి మా కుటుంబ సభ్యులందరి పేర్లు గుర్తుండడం నన్ను ఆశ్యర్యానికి గురి చేసింది. అంతటి సన్నహిత అనుబంధం కలగటం నా అదృష్టంగా భావిస్తాను.
నేను 1999లో మొట్టమొదటిసారి శ్రీ నిరంజన్ కాకా గారితో కలిసి ఆశ్రమాన్ని సందర్శిచాను. స్వామీజీ వారికి, నేను ఫ్యాక్టరీ ప్రారంభించి పదకొండు సంవత్సారాలు గడచినా ఏ రకమయిన అభివృద్ధి జరగలేదని తెలిపాను. వారు మీరు తిరిగి వెళ్లిన తరువాత అభివృద్ధి ప్రారంభమవుతుందని చెప్పారు. నా వ్యాపారం అభివృద్ధి చెంది, 2000 సంవత్సరంలో నేను మరి నాలుగు మగ్గాలను నెలకొల్పాను. 2001వ సంవత్సరంలో శ్రీస్వామీజీ వారు సూరత్ వచ్చారు. నేను వారికి నా ఫ్యాక్టరి వెనుకనే ఖాళీ ఆవరణ వున్నదనీ నా వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకుంటున్నానని తెలిపాను. వారు నన్ను ఆశీర్వదించి నా ప్రణాళికను కొనసాగింపమని తెలిపారు. నా దగ్గర రెండు లక్షల రూపాయల కన్నా తక్కువ డబ్బులు వున్నాయి. కాంట్రాక్టరు నాలుగు లక్షల వ్యయాన్ని అంచనా వేయగా. అసలు ఖర్చు ఎనిమిది లక్షలు అయింది. ఈ రోజుకూ నాకు ఆ విస్తరణకు అవసరమయిన నిధులు ఎలా సమకూరాయో అర్ధమవ్వదు. యిదంతా స్వామీజీ వారి ఆశీర్వాద బలంవల్లనే జరిగింది. నేను స్వామీజీ వారిని హృదయపూర్వకంగా నమ్మాను. నా కలలు నెరవేరాయి.
2001వ సంవత్సరంలో నా భార్యకు పక్షవాతం వచ్చింది. ఆ తరువాత నేను మైసూరు వెళ్ళినప్పుడు స్వామీజీ వారికి నా భార్య అనారోగ్యం గురించి తెలుసునీ తాను ఆ విషయం గురించి చూసుకుంటాననీ తెలిపారు. యివాళ ఆమెకు పక్షవాతం వచ్చిందనీ ఎవరూ గుర్తుపట్టలేరు. ఆమెకు పూర్తిగా నయమయింది. 2002వ సంవత్సరంలో శ్రీ స్వామీజీ వారికి స్వర్ణ తులాభారం జరిగింది. పాదుకాపూజ చేయడానికి ఆ సమయంలో లక్షరూపాయలు కట్టాలని తెలిపారు. నేను స్వామీజీ వారికోసం కొన్ని బహుమతులను తీసుకుని వెళ్ళి వారి పాదాలను స్పర్శ చేసుకోవడానికి అనుమతిని కోరాను. వారు అక్కడ వేలకొద్దీ భక్తులు వున్నా ఎవరికీ పాదాలను తాకడానికి అనుమతినీయలేదు, కానీ నాకు నా భార్యకు వారి పాదస్పర్శ చూసుకునే సదవకాశం కలిగించారు. మేము వారి దీవెనలను పొందగలిగే అదృష్టభాగ్యాన్ని అనుభవించగలిగాము.
శ్రీ స్వామీజీ మా మార్గదర్శి. ఆయన మా పురోగతికి మాకు దారి చూపించేవారు. మా రోజువారీ కార్యకలాపాలలో వారు మాతోపాటు ఇరవై నాలుగు గంటలూ వుంటారు. ఆయన ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. మేము వారిని మేల్కినినపుడు, తినేటప్పుడు, నీళ్లు త్రాగేటప్పుడు, నిద్రపోయే ముందూ వారి నామాన్ని అను నిత్యం స్మరిస్తూ వుంటాము. వారు మాతో అన్ని వేళలా వుంటారు. నేను స్వామీజీని కలుసుకునే ముందు వరకు భక్తిమార్గపరుడిని కాను. వారు ‘‘ధర్మం’’ ఏమిటో నాకు చూపించారు. వారు నిజమై ‘‘ధర్మం’’ గురించిన పరమార్ధాన్ని మాకు తెలిపారు. మీరు సరి అయిన కళ్లజోడు ధరించినపుడు మీ దృష్టి మారుతున్న విధంగా వుంటుంది. వారు మా చేత పేద ప్రజల ప్రయోజనం కోసం కార్యకలాపాలు చేయటం నేర్పి అభాగ్యులకు సహాయం చేయటం నేర్పారు.
మేము శ్రీ స్వామీజీ వారిని కలుసుకునే ముందర మాకు సామాజిక పరిధిగల సంఘంతో పరిచయాలు వుండేవి. వారిని కలిసిన అనంతరం, మా కుటుంబం, స్నేహితులే కాకుండా ‘‘దత్త పరివారం (కుటుంబం)’’తో పరిచయం అయింది. స్ధానికంగా మరియు జాతీయంగా వున్న ముఖ్యమైన వ్యక్తులను నేను తెలుసుకున్నాను. నేను దత్త పరివారం (కుటుంబం)లో వున్న సూరత్, బొంబాయి, మైసూరు మరియు దక్షిణభారత దేశం నుండి చాలామందిని తెలుసుకోగలిగాను, మేమంతా ఒక కుటుంబం అయ్యాము.
జయ గురు దత్త! శ్రీ గురు దత్త!