SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
ఎమ్. బాలరెడ్డి, అనంతపూరు (M.Bala Reddy, Anantapur)

నేను అనంతపూరుకు చెందిన తెలుగు పండితుణ్ణి. మున్సిపల్ హై స్కూలులో దాదాపు ముప్ఫై అయిదు సంవత్సరాలు పనిచేసిన అనంతరం పదవీ విరమణ చేశాను. మొట్టమొదటి సారిగా పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దర్శనాన్ని 1973లో నేను పొందగలిగాను. కానీ ఆ సమయంలో నాకంత ప్రభావం కలగలేదు. నాకు ఆ సమయంలో వారు కేవలం ఒక సాధారాణ ఆధ్యాత్మిక వ్యక్తిగా అనిపించారు. తరువాత వారు అనంతపురం ఆశ్రమానికి జ్ఞానసాగర ప్రతిష్ఠ సమయంలో నేను నేత్ర దర్శనానికై క్యూలో నడుస్తున్న తరుణంలో శ్రీ స్వామీజీ వారు నా ప్రక్కనే కనపడి నా వైపుకు బాగా చూశారు. నేను ఆశ్చర్యపోయాను, కానీ వారి దృష్టి నుండి నాలో చాలా శక్తి ప్రసారం జరిగింది.

‘జ్ఞాన సాగర దర్శనం అనంతరం, నేను యింటికి తిరిగి వెళ్ళాను. వారి శక్తితో నేను ఆనందాన్ని పొందాను. నా శరీరం, నా హృదయం, నా నాడీ వ్యవస్థ అన్నీ శాంతియుత స్థితిలోకి వచ్చేశాయి. అప్పటి నుండి నేను ఉదయం, సాయంత్రం నేను జ్ఞానసాగర ఆలయానికి వెళ్ళనారంభించాను. ఆ సమయంలో నా వయసులో వున్న మల్లికార్జున శాస్త్రి అనే ఒక భక్తుడు రోజూ ఉదయం ఆలయానికి వచ్చేవారు. ఆయన నన్ను గమనించి చెప్పిన విషయం తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను.

ఆయన అయిదు రోజుల అనంతరం వచ్చి నాకు అభివాదం తెలిపి ఆయన జ్ఞానసాగర ఆలయం విషయమై, శ్రీస్వామీజీ వారి కోసమై డబ్బు విరాళాలను సేకరించాలనే తన సంకల్పాన్ని తెలిపారు. ఆయన ఈ సంకల్పం తనకు కేవలం దత్తగురువు కృప వలననే వచ్చిందని తెలిపారు. ఆయన మనమిద్దరమూ కలిసి ఈ సేవ చేయాలని నన్ను ప్రోత్సహించసాగాడు. నేను యిక్కడ చిరకాల భక్తులు చాలామంది ఈ రకమయిన సేవలు చేస్తున్నారనీ అందువలన ఈ పని ప్రారంభించే ముందుగా స్వామీజీ వారి వద్దనుండి అనుమతిని పొందాలని నా మనసులో అనుకున్నాను.

మల్లికార్జున శాస్త్రిగారు దృఢమైన భక్తుడు. శ్రీ స్వామీజీ వారి సోదరులయిన నంజుండప్ప గారి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. నంజుడప్పగారు సంతోషంగా సహాయం చేయడానికి ఒప్పుకోగా వారితో పాటు మేము మైసూరుకు స్వామీజీ వారి అనుమతిని పొందడానికి వెళ్లాము. మా సంకల్పం గురించి విన్న అనంతరం స్వామీజీ వారు తమ అనుమతిని తెలిపారు. అంతకు ముందుగానే మాకు యిద్దరకు నచ్చిన వ్యక్తుల వద్దనుండే ఈ విరాళాలను సేకరించాలనీ, మా యిద్దరిలో ఏ ఒక్కరికీ సమ్మతం కాకపోయినా మేము వారిని డబ్బు అడగకూడదని నిశ్చయించుకుని మా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాము. మేము కొంత డబ్బు సేకరించిన అనంతరం ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశాము. అక్కడ బ్యాంకులో పనిచేసే సిబ్బంది కూడా విరాళాలను అందజేశారు. మొత్తానికి మేము డెబ్భై రెండు వేల రూపాయలను సేకరించగలిగాము. ఈ మొత్తాన్ని సేకరించాడానికి మేము పట్టణం మొత్తంలో ఏడువందల యిళ్లకు వెళ్లాము.

శ్రీ స్వామీజీ వారు జయలక్ష్మీ మాతా జయంతి సందర్భంగా అనంతపూరు వచ్చినప్పుడు మేము వారిని కలిసే అవకాశం కలిగింది. మేము బ్యాంకు పత్రాలను వారికి అందజేశాము. శ్రీ స్వామీజీ వారు చాలా ఆనందించి, మా ఈ సేవను అంగీకరించి మమ్మల్ని దీవించారు. ఆ తరువాత వారు మాకు పూర్ణఫల ప్రసాదాన్ని యిచ్చారు. స్వామీజీ వారిని అంత సంతోషంగా చూసినపుడు మాకు కూడా ఆనందం కలిగింది. ఆ తరువాత మేము బొమ్మెపర్తి ఆశ్రమంలో సేవ చేయడం ప్రారంభించాము.

1989 మార్చి నెలలో మరొక సంఘటన జరిగింది. ఒక రోజు జ్ఞాన సాగర ఆలయంలో కార్యక్రమాలు ముగిసి, భక్తులందరూ వెళ్లిపోయిన సమయంలో, శ్రీ స్వామీజీ వారు, ఆలయ పూజారి మరియు నేను అక్కడ వున్నాము. నేను అక్కడ సేవ చేస్తున్న సందర్భంలో శ్రీ స్వామీజీ వారు నన్ను వారి వద్దకు పిలిచి, వారు హఠాత్తుగా నాకు ‘‘శ్వాసదీక్ష’’ను యిచ్చారు. నాకు సొమ్మసిల్లినట్లుగా అనిపించి నేను మంత్ర ముగ్ధుడనయినాను. నాకు పరమానందం, సంతృప్తి కలిగాయి.

ఈ సంఘటన తరువాత వారు నా జీవితకాలం గురువా ? కాదా?అని నాకు సందేహాలు కలగసాగాయి. వారే నా గురువు కావాలని కోరుకున్నాను. నేను షిరిడీకి వెళ్ళి సాయిబాబాని నా సందిగ్ధతను గురించి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నా గురువు కావాలనే కోరిక కోరాలని నిశ్చయించుకున్నాను. యిలా ఆలోచించుకుని నేను షిరిడీకి వెళ్లాను. నేను ఆలయంలోకి వెళ్ళి సాయిబాబాను దర్శించుకుని వారి ఆశీర్వాదాన్ని పొందుతున్న సందర్భంలో నేను అక్కడ శ్రీ స్వామీజీ వారి ఉనికిని, వారి అనుభూతిని పొందగలిగాను. నేను చాలా సంతోషించి దాదాపు గంటన్నరపాటు ధారాళంగా కన్నీరు కార్చాను.

ఈ విధంగా శ్రీ స్వామీజీ వారు శ్వాసదీక్ష ద్వారా శక్తిప్రసారం చేసి, గురువును గురించిన నా సందేహాలను తీర్చి షిరిడిలో నాకు వారి దర్శనాన్ని భాగ్యం కలుగచేశారు. అప్పటి నుండి నేను పూర్తిగా వారి సేవలో నిమగ్నమయ్యాను. యిప్పటికీ నాకు వారు ప్రసాదించిన ‘‘శ్వాసదీక్ష’’ ద్వారి శక్తి కలిగి వున్నాను. ఎప్పడయినా నేను మతపరమైన లేదా పవిత్రస్థలాలకు వెళ్లినప్పుడు నాకు సంతోషము, ప్రశాంతత, సంతృప్తి కలుగుతుంది. నేను ఏదైనా అపవిత్ర ప్రదేశాలకి వెళ్ళిన తక్షణమే నాకు తెలిసిపోయి నేను ఆ ప్రదేశం నుండి బయటకు వచ్చేస్తాను.

ఈ సంఘటన జరిగడానికి ఆరు సంవత్సరాలకు ముందు నా స్నేహితుని యింటికి వెళ్ళినప్పుడు నేను ఒక దిగంబర స్వామీజీ వారిని కలుసుకున్నాను. వారు నన్ను వారి దగ్గరకు పిలిచి నాకు శ్వాస దీక్షను ప్రసాదించారు. మరల వారం తరువాత నేను తిరిగి వారి వద్దకు వెళ్ళినప్పుడు, వారు నా మీద అరచి, నన్ను కోప్పడ్డడం జరిగింది. నేను వారి పాదాలను తాకడానికి వంగినపుడు వారు నన్ను ఒక్క తన్ను తన్నారు. నేను మానసికంగా పక్కకు జరిగిపోయాను. ఆ తరువాత నాకు వారు శ్వాస దీక్ష ద్వారా శక్తిని అనుగ్రహించారనీ , నేను దానిని నా పాపాల వలన కొనసాగించలేకపోయానని. నేను ఆ శక్తిని కోల్పోయానని, నన్ను తన్నడం ద్వారా వారు నా పాపాలను తొలగింపచేశారని గ్రహించాను. ఆరు సంవత్సరాల అనంతరం నాకు శ్రీ స్వామీజీ వారి వద్ద వారి అనుగ్రహం ద్వారా ఈ శక్తి యిప్పటి వరకు నాలో వుంది. ధ్యానయోగంలో వున్నప్పడు నేను ఈ శక్తిని ఉపయోగించి వారి ఆశీస్సులను పొంది మిగతా కార్యక్రమాలను సులభంగా పూర్తిచేయగలుగుతున్నాను. యిది ఒక అద్వితీయమైన స్థితి.

యిప్పటికీ నాకు భౌతిక విషయాలపై ఆసక్తి లేదు. 1992లో బొమ్మెపర్తి ఆశ్రమంలో కార్యక్రమాలు ముగిసిన అనంతరం నలుగురు వాలంటీర్లు మాత్రమే మిగిలి వున్నారు.

శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని పిలిచి ఏదైనా కోరుకోమని అడిగారు. ముగ్గురు వారి కోరికలను తెలిపారు. నేను మాత్రమే మిగిలిపోయాను. మొదట్లో నాకు ఏ కోరికా కోరాలనిపించలేదు. కానీ శ్రీ స్వామీజీ వారికి అన్నీ తెలుసును. వారు నన్ను ఏదైనా కోరుకోమని అడిగినప్పుడు నేను, నా ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళుతున్నప్పుడు యోగస్థితిలో వుండేలా ఆశీర్వదించమని కోరాను వారు ఏమీ మాటలాడక వారి చేతితో నన్ను ఆశీర్వదించారు.

ఈ మూడు సంఘటనల ద్వారా నేను ఖచ్చితంగా శక్తిప్రసారాన్ని అందుకున్నాను. నేను దూరంలో వుండి శ్రీ స్వామీజీ వారిని ప్రార్ధించినా కూడా నాకు చాలా సంతోషం కలిగి ఏ అడ్డంకులూ లేకుండా పనులు మరియు సేవ చేయగలుగుతాను. వారి సమక్షంలో మనము వారికి మానసికంగా శరణాగతి అవ్వాలి. వారు మనతో ఎల్లవేళాలా వుండి వారి ఆశీస్సులను అందజేస్తారు. నాకు యిలా ప్రతీరోజూ జరుగుతుంది. నాకు వారి పాదాల వద్దనే ఎల్లప్పుడూ వుండిపోవాలని అనిపిస్తుంది దానికి కారణం వారు నా జీవితంలో ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం వహిస్తూనే వుంటారు. ఆధ్యాత్మిక మార్గంలోను, నా ఆహారపు అలవాట్లలోనూ, నా ఆలోచనలలోనూ ప్రతిసందర్భంలోనూ వారు నాతోనే వున్నారు. నేను ఏదయినా పొరపాటు చేస్తే వారు నన్ను సరిదిద్ది, వారు నన్ను గద్దిస్తున్న దృశ్యం నాకు స్ఫురిస్తుంది. ఈ విషయం నాకు బోధ పడుతుంది. నేను యితరలకు వివరించలేను.

నేను సాయంకాలం పూట స్మశానం వైపు నడిచి వెళుతుంటాను. ఒకసారి వెనుదిరిగి వస్తున్న సందర్భంలో బాగా చీకటిగా వుండి నా మనసులో దత్తపరమేశ్వరుడికి ఈ వైరాగ్యంతో కూడిన స్మశానంలో నేను యోగం ఎలా చేయగలను. నాకు ఎప్పుడు శక్తి వస్తుంది అని అనుకుంటూ నడవసాగాను. యింతలో నా వెనకాల ఒక పదహారేళ్ళ బాలుడు నన్ను చూసి చప్పట్లు చరుస్తూ నృత్యం చేయసాగాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. నేను అతని వైపుకు తిరిగి వంగి నమస్కారం చేశాను. నాకు శ్రీ దత్తుడు నన్ను నేరుగా దీవించాడన్న అనుభూతి కలిగింది. నా జీవిత లక్ష్యాన్ని సాధించాడానికి శ్రీ స్వామీజీ వారు నాతోపాటు ఎల్లప్పుడూ వుంటారు. మోక్షం పొందటానికి జపం ద్వారా, మంత్రం ద్వారా, భజనల ద్వారా, యోగా ద్వారా వారు ఎల్లప్పడు నాతోపాటూ ఉంటారు.

నేను ఎల్లప్పుడూ వారి సేవలోనే వుంటాను. నేను బొమ్మెపర్తి ఆశ్రమానికి వెళ్ళకపోతే నాకు ఏదో కోల్పోయినట్లనిపిస్తుంది. కొంత మంది భక్తులతో దైవిక సంబంధమైన ఆలోచనలను పంచుకుంటాను. నేను స్వామీజీ వారిని గురించి జయలక్ష్మీ మాతా గురించి కొత్తగా వచ్చిన భక్తులకు చెబుతుంటాను. ఒకసారి శ్రీ స్వామీజీ వారు బొమ్మెపర్తి ఆశ్రమాని వచ్చినప్పుడు మేమంతా వారికి వంగి నమస్కారం చేశాము. మరల వారు తిరిగి వెళుతున్నప్పుడు వారికి నమస్కారం చేశాము. అప్పుడు వారు మీరు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలును అని మాకు తెలిపారు.

2005వ సంవత్సరంలో నేను చికెనుగున్యాతో బాధపడ్డాను. యిది ఒక దోమ కాటు వలన వైరల్ గా అందరికి వ్యాప్తి చెందే జ్వరము. మా యింట్లోని వారందరికీ ఈ రకమైన జ్వరము వచ్చి బాధపడసాగాము. నాకు అప్పుడు నేను కోలుకోగలిగినట్లయితే నేను మా యింట్లో వాళ్లందరి ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త తీసుకోగలననిపించి, నా మనసులో సంకల్పించుకుని శ్రీ స్వామీజీ వారిని రక్షించమని ప్రార్ధించాను. ఆ రోజు మిట్టమధ్యాహ్నం ఒక పెద్ద మీసం కలిగిన ఒక అసాధారణ వ్యక్తి వచ్చి ‘‘రోటీ దేహీ’’ అని చేతులు చాపాడు. నేను అతనికి కొన్ని రొట్టెలు యిచ్చాను. అతను అవి తీసుకుని తిరిగి వెళ్లిపోయాడు. ఆ తరువాత నా ఒళ్లు నొప్పులు తగ్గాయి. అతను రోట్టెలను తీసుకుని నా పాపాలను తొలగించాడు. నాకు అతను వేరేవరో కాదనీ సాక్షాత్తు ఆ దత్త ప్రభువేనని గ్రహించాను.

జయ గురు దత్త

Tags: